- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Condolences: పాతబస్తీలో అగ్నిప్రమాద మరణాల పట్ల కేసీఆర్.. ప్రముఖుల సంతాపం
చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనపై ప్రముఖ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (Charminar Fire Accident) చార్మినార్ పరిధిలోని (Gulzar House) గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనపై ప్రముఖ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ అగ్నిప్రమాదంలో స్పాట్‌లో ముగ్గురు మరణించగా.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరో 14 మంది మరణించారు. మృతుల సంఖ్య 17కి చేరుకోగా.. మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన ద్వారా సంతాపం ప్రకటించారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించి కాపాడాలని, మరణించిన వారి కుటుంబాలకు తగు ఆర్థిక సాయం చేసి అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ సూచించారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా నిత్యం అప్రమత్తంగా ఉంటూ తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి కేసీఆర్ సూచించారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సీనియర్ డాక్టర్లతో స్పెషల్ టీమ్: మంత్రి దామోదర రాజనర్సింహ
ఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌజ్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పిల్లలు, వృద్ధులు సహా పలువురు ప్రాణాలు కోల్పోయారని తెలిసి మంత్రి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని, సీనియర్ డాక్టర్లతో కూడిన స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేయాలని, ఈ టీమ్‌లు నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పోలీస్, ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులతో సమన్యయం చేసుకోవాలని సూచించారు.
మెరుగైన చికిత్స అందించాలి: ఈటల రాజేందర్
హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 17 మంది మృతి చెందడం దురదృష్టకరమని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని మోడీ చనిపోయిన వారికి, గాయపడిన వారికి నష్టపరిహారం ప్రకటించారని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉదారంగా నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
అన్ని విధాల కేంద్రం అండగా ఉంటుంది: బండి సంజయ్
గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద సంఘటన పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఒక ప్రకటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులకు సూచించారు. మృతుల కుటుంబాలను అన్ని విధాల కేంద్రం అండగా ఉంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ భరోసా ఇచ్చారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండ: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
చార్మినార్ పరిధిలో గుల్జార్ హౌస్ వద్ద అగ్ని ప్రమాద ఘటన దిగ్భ్రాంతికరమైన విషయమని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. మృతుల కుటుంబాలకు ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
అగ్నిప్రమద ఘటనపై కేటీఆర్, కవిత దిగ్భ్రాంతి
చార్మినార్ సమీపంలోని మీర్‌చౌక్‌లో జరిగిన అగ్నిప్రమదంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాకు ప్రగాఢ సానుభూతిని వారు ఎక్స్ వేదికగా తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని క్షతగాత్రులకు మెరుగైన ఉచిత చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఈ సంక్షోభ సమయంలో అవసరమైన ఏ సహాయానికైనా అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ ఘటనలో బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు అధికారులతో కలిసి పనిచేస్తారని తెలిపారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ నేతలకు ప్రమాద స్థలం వద్ద సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.






