కోట శ్రీనివాస రావు మృతిపై KCR, KTR సంతాపం

by Gantepaka Srikanth |

ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasarao) మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR), మాజీ మంత్రి కేటీఆర్(KTR) సంతాపం వ్యక్తం చేశారు.

కోట శ్రీనివాస రావు మృతిపై KCR, KTR సంతాపం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasarao) మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR), మాజీ మంత్రి కేటీఆర్(KTR) సంతాపం వ్యక్తం చేశారు. విభిన్న పాత్రలను పోషించి, ప్రేక్షక హృదయాల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్న విలక్షణ వెండితెర నటుడు కోట శ్రీనివాసరావు అని కేసీఆర్ అన్నారు. ఆయన మరణంతో సినీమా రంగం ఒక గొప్ప నటున్ని కోల్పోయిందని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. కోట శ్రీనివాసరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

‘తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా, అసాధారణ పాత్రధారిగా తనదైన ముద్ర వేసిన కోట శ్రీనివాసరావు మరణం ఆవేదన కలిగించింది. ఆయన నాలుగు దశాబ్దాలకు పైగా, 750కి పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను ఆకర్షించారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్య నటుడిగా ఆయన పోషించిన విభిన్న పాత్రలు తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. పద్మశ్రీ, తొమ్మిది నంది అవార్డులు, ఎన్నో ఇతర పురస్కారాలు అందుకున్న కోట.. తన నటనా నైపుణ్యంతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని స్థానం సంపాదించారు. రాజకీయ రంగంలో కూడా విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా సేవలందించిన ఆయన, సమాజానికి తన వంతు సహకారాన్ని అందించారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఈ దుఃఖ సమయంలో కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

Next Story