బిగ్ న్యూస్: ఏపీలో ఎంట్రీకి KCR రెడీ.. త్వరలోనే అక్కడ భారీ బహిరంగ సభకు ప్లాన్..?!

by Disha Web Desk 19 |
బిగ్ న్యూస్: ఏపీలో ఎంట్రీకి KCR రెడీ.. త్వరలోనే అక్కడ భారీ బహిరంగ సభకు ప్లాన్..?!
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎజెండాతో ఏపీలో అడుగుపెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతుంది. ఈ నెల మూడో వారంలో వైజాగ్‌లో భారీ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్లాంట్ కార్మికులకు, కార్మిక సంఘాలు చేపడుతున్న నిరసనలకు అండగా సంఘీభావం తెలపాలని ఏపీ పార్టీ కమిటీకి పార్టీ అధిష్టానం ఆదేశాలు సైతం ఇచ్చింది. ఈ సభతో గులాబీ బాస్ ఏపీలో పాగా వేయాలని భావిస్తున్నారు. అందుకు ప్రజలను సమీకరించే పనిలో ఏపీ నేతలు నిమగ్నమయ్యారు.

జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్ ఏపీకి వెళ్లలేదు. గత డిసెంబర్ 9న టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చారు. ఈ ఏడాది జనవరి 2న ఏపీకి చెందిన సీనియర్ నాయకులు సైతం బీఆర్ఎస్‌లో చేరారు. అయితే ఆ రాష్ట్రంలో భారీ బహిరంగసభ నిర్వహిస్తారని ప్రచారం జరిగినప్పటికీ నిర్వహించలేదు. ఆ రాష్ట్రంలోకి గులాబీ బాస్ అడుగుపెట్టలేదు. కేవలం మహారాష్ట్ర పైనే కేసీఆర్ ఫోకస్ పెట్టారు. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలని కుట్ర జరుగుతుందని, కేంద్రం రాయితీలు ఇవ్వడం లేదని కార్మికులు, కార్మికసంఘాలు నిరసనలు చేపడుతున్నాయి.

ఇప్పటివరకు ఏపీలో గ్రాండ్‌గా అడుగుపెట్టేందుకు కేసీఆర్‌కు అవకాశాలు రాకపోవడంతో, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంను ఎత్తుకొని ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. విశాఖలో భారీ బహిరంగసభను నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ నెల మూడోవారంలో నిర్వహించాలని కేసీఆర్ ప్రణాళికలు సైతం రూపొందించారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సైతం ఈ నెల 27న ఉండటంతో అంతకు ముందే నిర్వహించి ఏపీలో సభ నిర్వహించి రెండు తెలుగురాష్ట్రాల్లోని ప్రజల్లో భరోసా , పార్టీ కేడర్ లో జోష్ నింపాలని భావిస్తున్నట్లు సమాచారం.

వర్కింగ్ క్యాపిటల్, ముడిసరుకు కోసం నిధుల సమీకరణ పేరిట స్టీల్ ప్లాంట్ తాళాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు కేంద్రం కొత్త కుట్ర చేస్తుందని, దానిని మానుకోవాలని మంత్రి కేటీఆర్ కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. మోడీ.. తన కార్పొరేట్ మిత్రులకు 12.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పట్ల ఇదే ఔదార్యం ఎందుకు లేదని ప్రశ్నించారు.

కేంద్రమే ఈ వర్కింగ్ కాపిటల్ కోసం ఆర్థిక సహాయం అందించి వైజాగ్ స్టీల్ నుంచి స్టీల్ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లక్షన్నర కోట్ల రూపాయల విలువ కలిగిన స్టీల్ ప్లాంట్‌ను అప్పనంగా ప్రవేట్ పరం చేసే కుట్రలను కేంద్రం ఆపాలని ఆలేఖలో పేర్కొన్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఫ్యాక్టరీ ప్రైవేటుపరం చేయకుండా అడ్డుకునేందుకు మద్దతు తెలపాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు కలిసి విజ్ఞప్తి చేశారు.

దీంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు, కార్మిక సంఘాలను కలిసి వారికి సంఘీభావం తెలియజేయాలని ఏపీ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ను అధిష్టానం ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటం, ఏపీలో రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలతో వేడెక్కింది. వైఎస్ఆర్సీపీ, టీడీపీ మధ్య పోరు తారాస్థాయికి చేరింది.

ఇదే అదునుగా భావించి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అంశంగా చేసుకొని రంగప్రవేశం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే భారీ సభ నిర్వహించి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా కల్పించే ప్రయత్నం చేయనున్నట్లు సమాచారం. తెలంగాణలో చేపడుతున్న సంక్షేమ పథకాలు, పరిశ్రమలకు కల్పిస్తున్న ప్రోత్సాహకాలను సైతం వివరించి ఆకర్శించే ప్లాన్‌కు రంగం సిద్ధం చేశారు.

ఏపీలో అన్ని పార్టీలు యాక్టీవ్ అయ్యాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. జగన్ ప్రభుత్వంపై ఆసంతృప్తి స్టార్ట్ అయింది. అయితే ఇప్పటివరకు జగన్‌తో కేసీఆర్ సన్నిహిత సంబంధాలు ఉండటంతోనే కొంత వెనుకాముందు ఆలోచించినట్లు సమాచారం. అయితే అక్కడి ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని టీడీపీకి లాభం చేకూరుతుందని దానికి అడ్డుకట్టవేసేందుకే గులాబీ బాస్ ఏపీపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. వ్యతిరేకత ఓటు బీఆర్ఎస్ వైపునకు మళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

జగన్‌కు లాభం కూర్చే యత్నంలో భాగంగానే కేసీఆర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పేరుతో ఉద్యమ కార్యచరణకు శ్రీకారం చుడుతున్నారని విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగానే కేంద్రానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో లేఖ రాయించడం, ఏపీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ను సైతం కార్మికులకు సంఘీభావం తెలిపాలని ఆదేశించారని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. ఇదే అదనుగా తీసుకొని రాజకీయ చతురత కలిగిన కేసీఆర్ ఏపీలో పట్టు సాధించేందుకు స్కెచ్ వేస్తున్నట్లు తెలిసింది. ఏదీ ఏమైన ఏపీలో మాత్రం స్టీల్ ప్లాంట్ అంశంతో సభ నిర్వహించి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. సభకు జన సమీకరణపై చంద్రశేఖర్ దృష్టిసారించినట్లు సమాచారం.



Next Story