కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు : హరీష్ రావు

by Taduka Kalyani |

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయి రెండున్నరేళ్లు పూర్తయినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, అవినీతి, అరాచకాలపై ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ సమర్థవంతంగా పోరాటం చేస్తోందని హరీష్ రావు అన్నారు.

కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు : హరీష్ రావు
X

దిశ, వరంగల్ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయి రెండున్నరేళ్లు పూర్తయినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, అవినీతి, అరాచకాలపై ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ సమర్థవంతంగా పోరాటం చేస్తోందని మాజీ మంత్రి, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అన్నారు. హనుమకొండలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న తప్పుదోవ పట్టించే విధానాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకువస్తున్నామని, ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తల అండదండలతోనే ఈ పోరాటం మరింత బలంగా కొనసాగుతోందన్నారు. కేసీఆర్ పాలనలో అమలైన సంక్షేమ పథకాల వెనుక స్పష్టమైన విజన్ ఉందని హరీష్ రావు పేర్కొన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల వల్ల బాల్య వివాహాలు గణనీయంగా తగ్గాయని, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి పథకాలతో మాతా-శిశు మరణాల రేటు తగ్గిందన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల విద్యాభివృద్ధికి గురుకుల పాఠశాలలు ఎంతో దోహదపడ్డాయని, బాల కార్మిక వ్యవస్థ తగ్గడంలో కూడా అవి కీలక పాత్ర పోషించాయని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించడంతో పాటు ఫ్లోరైడ్ సమస్యను అధిగమించామని, మిషన్ కాకతీయ, చెక్‌డ్యాంలు, సాగునీటి ప్రాజెక్టులతో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చామని తెలిపారు. రైతుల ఆత్మహత్యలు తగ్గడంలో ఈ పథకాలు కీలకంగా పనిచేశాయని పేర్కొన్నారు. హిందూ, ముస్లిం వర్గాలను కేసీఆర్ సమాన దృష్టితో చూసారని, ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పాలన కోరుకుంటున్నారని హరీష్ రావు అన్నారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలవడం తమ బాధ్యత అని, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.

Next Story