కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్ రావు భేటీ: పార్టీ బలోపేతంపై కీలక చర్చలు

by Naga Rani Yarlagadda |

బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావుతో ఆ పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీశ్ రావు సుదీర్ఘంగా సమావేశమయ్యారు.

కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్ రావు భేటీ: పార్టీ బలోపేతంపై కీలక చర్చలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావుతో ఆ పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీశ్ రావు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఈ భేటీ జరిగింది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత బలోపేతంపై ఈ సందర్భంగా ముగ్గురు నేతలు సుమారు రెండు గంటలకు పైగా చర్చించినట్లు సమాచారం. ప్రధానంగా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరం చేయడంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. జిల్లాల వారీగా పార్టీ కేడర్‌ను యాక్టివేట్ చేయడం, కొత్తగా సభ్యత్వం తీసుకునే వారికి పార్టీ అండగా ఉంటుందనే నమ్మకాన్ని కల్పించడంపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

సంస్థాగత కమిటీల నిర్మాణం

పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు వీలుగా గ్రామ, మండల, జిల్లా స్థాయి సంస్థాగత కమిటీల నియామకంపై ఈ సమావేశంలో చర్చించారు. పెండింగ్‌లో ఉన్న కమిటీలను త్వరితగతిన పూర్తి చేసి, క్రియాశీలక కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న అకాల వర్షాలు, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వంటి ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో పార్టీ చేపట్టబోయే ప్రజా ఆందోళనలు, భవిష్యత్ కార్యాచరణపై కేటీఆర్, హరీశ్ రావులకు కేసీఆర్ కీలక సూచనలు చేశారు. త్వరలోనే పార్టీ కీలక సమావేశం నిర్వహించి, ఈ కమిటీల నియామకంపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Next Story