హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావుకు చుక్కెదురు .. స్టే ఇవ్వలేమన్న ధర్మాసనం

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-22 07:15:48  IST  )

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌పై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టివేయాలని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావుకు చుక్కెదురు .. స్టే ఇవ్వలేమన్న ధర్మాసనం
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌పై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టివేయాలని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ రెండో రోజు ధర్మాసనం వారి పిటిషన్లపై విచారణ చేపట్టగా.. వాదనలు ముగిశాయి. విచారణ సందర్భంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో పెట్టి చర్చించాకే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టీస్ పీ చంద్రఘోష్ ఇచ్చిన కాళేశ్వరం నివేదికను ఒకవేళ పబ్లిక్ డొమైన్‌లో పెట్టి ఉంటే వెంటనే తొలగించాలని చెప్పింది. పూర్తి వివరాలతో మూడు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ కేసులో మద్యంతర ఉత్తర్వులు అవసరం లేదని.. పిటిషనర్లు కోరిన విధంగా స్టే ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. కేసులో తదుపరి విచారణను ఐదు వారాలకు వాయిదా వేశారు.

కేసీఆర్‌కు నష్టం చేకూర్చేలా నివేదిక.. ఆర్యామా సుందరం

కాగా, మాజీ సీఎం కేసీఆర్‌ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్యమా సుందరం వాదనలు వినిపించారు. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నిబంధనలు పాటించలేదని కోర్టుకు తెలిపారు. నోటీసులు సరైన విధానంలో ఇవ్వలేదని అన్నారు. జస్టిస్ చంద్రఘోష్ నివేదికను తమ పిటిషన్లు అయిన కేసీఆర్‌, హరీశ్‌రావుకు ఇవ్వలేదని తెలిపారు. కమిషన్‌ సమర్పించిన నివేదికను ప్రభుత్వం పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పొలిటికల్‌గా బీఆర్ఎస్ పార్టీతో పాటు కేసీఆర్‌కు నష్టం చేకూర్చేలా నివేదిక రూపొందించారని ధర్మాసనానికి విన్నవించారు. నివేదికను వెబ్‌సైట్‌లోనూ అప్‌లోడ్‌ చేశారని, కేసీఆర్‌కు మాత్రం నివేదిక కాపీలు ఇవ్వలేదని, ఆ విషయంపై ప్రభుత్వానికి లేఖ రాసినా ఎలాంటి స్పందన లేదని కేసీఆర్‌ తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం ఆరోపించారు.

అసెంబ్లీలో చర్చకు సర్కార్ ప్రణాళిక.. ఏజీ సుదర్శన్ రెడ్డి

ఇక తెలంగాణ సర్కార్ తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. జస్టిస్ చంద్రఘోష్ ఇచ్చిన కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో చర్చించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నట్లుగా కోర్టుకు తెలిపారు. ఇద్దరు పిటిషనర్లు అసెంబ్లీలో సభ్యులుగా ఉన్నారని తెలిపారు. అలాంటప్పుడు నివేదికను ఎందుకు బయటపెట్టారని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. మీడియా సమావేశంలో ప్రతి విలేకరికి 60 పేజీల నివేదిక ఇచ్చారని సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. కోర్టుకు ఇచ్చిన నివేదిక కాపీలు స్పష్టంగా లేవని సీజే కామెంట్ చేశారు. అయితే, కేసు ప్రాధాన్యం దృష్ట్యా విచారణ ఇవాళే కొనసాగించాలని కేసీఆర్‌ తరఫు న్యాయవాది అర్యమా సుందరం కోర్టును అభ్యర్థించగా.. ధర్మాసనం విచారణను నేటి వాయిదా వేసింది.

Next Story