కాజీపేట ఆర్ఎంయూ.. నెక్స్ట్ జనరేషన్ కోచ్‌లకు కేరాఫ్

by Naga Rani Yarlagadda |

భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మార్చబోయే నెక్స్ట్-జనరేషన్ రైల్వే కోచ్‌లు, అత్యాధునిక రోలింగ్ స్టాక్ తయారీకి కాజీపేట రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కేరాఫ్ అడ్రస్‌గా మారబోతోందని రైల్వే బోర్డు చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సతీష్ కుమార్ పేర్కొన్నారు.

కాజీపేట ఆర్ఎంయూ.. నెక్స్ట్ జనరేషన్ కోచ్‌లకు కేరాఫ్
X
  • రూ. 597.68 కోట్ల ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ ప్రత్యేక ఫోకస్
  • చర్లపల్లి టెర్మినల్, జనగాం స్టేషన్లలో విస్తృత తనిఖీలు.. అధికారులకు డెడ్‌లైన్

దిశ, తెలంగాణ బ్యూరో : భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మార్చబోయే నెక్స్ట్-జనరేషన్ రైల్వే కోచ్‌లు, అత్యాధునిక రోలింగ్ స్టాక్ తయారీకి కాజీపేట రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ) కేరాఫ్ అడ్రస్‌గా మారబోతోందని రైల్వే బోర్డు చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సతీష్ కుమార్ పేర్కొన్నారు. రూ.597.68 కోట్ల భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు పనులను ఆయన ఆదివారం క్షేత్రస్థాయిలో అంగుళం అంగుళం పరిశీలించారు. మెయిన్ షెడ్, బోగీ షాప్, పెయింట్ షాప్, వీల్ షాప్, టెస్టింగ్ షాప్‌లలోకి వెళ్లి గ్రౌండ్ రియాలిటీని తనిఖీ చేశారు. రైల్వే అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కాజీపేట్ రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, చర్లపల్లి టెర్మినల్‌, జనగాం అమృత్ స్టేషన్‌, ఇరిసెట్ కేంద్రాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డా. ఆర్. గోపాలకృష్ణన్, ఇతర సీనియర్ రైల్వే అధికారులు పాల్గొన్నారు.

కాజీపేట రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్

ఆర్‌వీఎన్‌ఎల్ అధికారులు మినియేచర్ మోడల్ ద్వారా ఆర్ఎంయూకు సంబంధించిన కీలకాశాలను వివరించగా, ప్రతి విభాగం పురోగతిపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. చైర్మన్ ఇక్కడి మెయిన్ షెడ్, బోగీ షాప్, పెయింట్ షాప్, వీల్ షాప్, టెస్టింగ్ షాప్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాజీపేట నుండి చర్లపల్లి మార్గమధ్యంలో జనగాం రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసిన చైర్మన్... అక్కడ జరుగుతున్న పునరాభివృద్ధి పనులు, ప్రయాణీకుల సౌకర్యాలను సమీక్షించారు. చర్లపల్లి కొత్త రైల్వే టెర్మినల్‌లో ట్రాక్‌లు, పాయింట్లు, క్రాసింగ్‌లు, యార్డ్‌ను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో విధుల్లో ఉన్న ట్రాక్‌మెన్, గ్యాంగ్‌మెన్‌లతో మాట్లాడి, వారి పనితీరును అడిగి తెలుసుకున్నారు.

కవచ్ 4.0 అమలుపై సమీక్ష

ఇండియన్ రైల్వేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ (ఇరిసెట్)తో పాటు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను సందర్శించిన సతీష్ కుమార్... స్వదేశీ సాంకేతికతతో రూపొందిన యాంటీ-కొలిజన్ సిస్టమ్ 'కవచ్' ప్రగతిపై చర్చించారు. భారతీయ రైల్వేలో 'కవచ్ 4.0' అమలు తీరును అధికారులు ఆయనకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. చివర్లో రైల్ నిలయంను సందర్శించిన రైల్వే బోర్డు చైర్మన్... జోన్ సాధారణ పనితీరు, ప్రయాణికుల సేవలపై జీఎం, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రయాణికుల భద్రత, మౌలిక వసతుల కల్పనలో రాజీ పడొద్దని ఈ సందర్భంగా అధికారులకు స్పష్టం చేశారు.

Next Story