- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికారం ఎటుంటే.. అటువైపే ఓవైసీ బ్రదర్స్: కవిత
ఓవైసీ బ్రదర్స్ అధికారం చుట్టూ తిరిగే సన్ ప్లవర్స్ అని.. అధికారం ఎటు ఉంటే వాళ్లు అటు ఉంటారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఓవైసీ బ్రదర్స్ అధికారం చుట్టూ తిరిగే సన్ ప్లవర్స్ అని.. అధికారం ఎటు ఉంటే వాళ్లు అటు ఉంటారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం జాగృతి భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ కేంద్రంలో ఓవైసీ బ్రదర్స్‌ను వ్యతిరేకిస్తారని.. కానీ ఇక్కడ సీఎం మాత్రం వారితో దోస్తానా చేస్తారని అన్నారు. రేవంత్‌రెడ్డి వచ్చాక రంజాన్ తోఫా ఇవ్వలేదన్నారు. ఓల్డ్ సిటీలో అసలు అభివృద్ధి లేదని.. ఓవైసీ సోదరులు ఓల్డ్ సిటీలో ఎందుకు ఉండటం లేదని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంతో పెద్ద బూతల వర్షం ముగిసినట్లు అనిపించిందని అన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా ప్రజల సమస్యల మీద ఎవరూ మాట్లాడలేదని.. ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం మాత్రమే చేశారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలు కూడా పార్టీ గుర్తు లేకుండా జరిగితే బాగుండేదనిపించిందన్నారు. బీజేపీ నుంచి జాతీయ అధ్యక్షుడు సైతం వచ్చి ప్రచారం చేశారని.. కానీ, దురదృష్టం ఏంటంటే మహబూబ్‌నగర్‌లో ఇప్పటికీ రెండు రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయని తెలిపారు. వ్యక్తులను తిట్టడానికే మున్సిపల్ఎన్నికలు పరిమితమయ్యాయని.. ఈ ఎన్నికల్లో మంచివాళ్లను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కలిశాయని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా సర్దుబాట్లు చేసుకున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు ఉంటే ఒక్క మున్సిపాలిటీకి మాత్రమే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వచ్చిందని.. గుంపుమేస్త్రీ, గుంటనక్క స్నేహం కారణంగా సిద్దిపేటకు మాత్రమే మంజూరు చేశారని కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ ఉన్నా.. కాంగ్రెస్ ఉన్నా గుంటనక్కకే పనులు అవుతున్నాయని పేర్కొన్నారు.
రైతు రుణమాఫీపై చర్చకు సిద్ధం
ఈ నెల 26న బడ్జెట్ రాబోతున్నదని.. గుణాత్మక మార్పునకు అవకాశం ఉన్న బడ్జెట్ ఇది అని.. 2028, 2029లో ఎప్పుడు ఎన్నికలు ఉన్నా అప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టలేరని కవిత అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక సంపద పెంచాల్సింది పోయి ఏడువేల కోట్ల రూపాయల భూములు అమ్మకున్నారని.. రెవెన్యూ డిఫిసిట్ రూ.9 వేల కోట్లు ఉన్నదని.. సంపద సృష్టి లేదని ఆరోపించారు. అప్పులు మాత్రం 122 శాతం ఎక్కువగా చేశారని పేర్కొన్నారు. పింఛన్ల కోసం గత బడ్జెట్‌లో పెట్టిన లక్షా 21 వేల కోట్లలో 51 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. వచ్చే బడ్జెట్‌ను కచ్చితంగా రూ.3 లక్షల 25 వేల కోట్లుగా పెట్టే అవకాశం ఉన్నదని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లలో ఇచ్చిన మాట ప్రకారం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో చెప్పినట్లుగా ఏటా బీసీలకు రూ.20 వేల కోట్లు బడ్జెట్ పెట్టాలని.. బీసీ సబ్ ప్లాన్ ప్రకటించాలని అన్నారు. పింఛన్ల కోసం బడ్జెట్ డబుల్ చేయాలని.. రూ.35 వేల కోట్లు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లకు నిధులు కేటాయించాల్సిన అవసరం ఉన్నదని.. ఉద్యమకారులకు, ఆటోడ్రైవర్ల పెన్షన్, కళాకారులకు పెన్షన్ కోసం బడ్జెట్‌లో ప్రావిజన్ పెట్టాలన్నారు. రైతు రుణమాఫీ వందశాతం చేశామని సీఎం చెప్పారని.. నిజామాబాద్, మహబూబ్‌నగర్, సచివాలయం ఎక్కడైనా సరే చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎంకు సవాల్ విసిరారు. రైతులకు రూ.44 వేల కోట్లు రుణమాఫీ అని చేసింది రూ.21 వేల కోట్లు మాత్రమేనన్నారు. బీఆర్ఎస్ జాబ్స్ ఇవ్వలేదని చెప్పి మీరు కూడా జాబ్స్ ఇవ్వటం లేదన్నారు. ఈ నెల 12న జరిగే లేబర్ కోడ్ బిల్లుకు వ్యతిరేకంగా జరిగే బంద్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. అదే రోజు జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ జరుగుతుందన్నారు.






