Kavitha: వారం రోజులుగా పెండింగ్ లోనే కవిత రాజీనామా.. కారణం ఇదేనా?

by Prasad Jukanti |

రాష్ట్ర రాజకీయాల్లో కవిత ఎపిసోడ్ సంచలనంగా మారింది.

Kavitha: వారం రోజులుగా పెండింగ్ లోనే కవిత రాజీనామా.. కారణం ఇదేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కవిత ఎపిసోడ్ ఆసక్తి రేపుతోంది. ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసి వారం రోజులు అవుతున్నా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీఆర్ఎస్ పార్టీలో ఏర్పడిన విభేదాల కారణంగా ఈ నెల 3వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యుత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కవిత ప్రకటించారు. ఆ వెంటనే చైర్మన్ ఫార్మాట్ లో రాజీనామా లేఖను తన అనుచరులతో చైర్మన్ కార్యాలయానికి అందజేశారు. అనంతరం కవిత స్వయంగా చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫోన్ చేసి, తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. దీనిపై స్పందించిన గుత్తా తాను ప్రస్తుతం అందుబాటులో లేనని తర్వాత మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు సమాచారం. ఇయితే ఇదంతా జరిగి వారం రోజులు అవుతున్నా ఇప్పటికీ కవిత రాజీనామా ఇంకా పెండింగ్ లో ఉండటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాశంగా మారింది.

కవిత రాజీనామాకు ఆ ఎన్నికల అడ్డంకి?:

కవిత రాజీనామా ఆమోదం విషయంలో పలు అంశాలు తెరపైకి వస్తున్నాయి. కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ కావడంతో ఆమె రాజీనామా అంశం ఇంకా పెండింగ్ లోనే ఉండే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జడ్పీటీసీ, ఎంపీటీసీల పదవుల్లో లేకపోవడంతో వీటికి ఎన్నికలు జరగాల్సి ఉంది. మండలి చైర్మన్ కవిత రాజీనామాను ఆమోదిస్తే ఆరు నెలల్లో ఆ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించాలి. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ కారణంతోనే కవిత రాజీనామాను ఆమోదించలేదా అనే అభిప్రాయులు వినిపిస్తున్నాయి. ఇక కవిత నేరుగా చైర్మన్ ను కలిస్తే రాజీనామాను ఆమోదించే తప్పదు అనే చర్చ జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు కవిత చైర్మన్ ను కలవలేదు.

రాజీనామా ఆమోదం తర్వాతే భవిష్యత్ కార్యాచరణ?

బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన కవిత తన రాజకీయ భవిష్యత్ పై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే వివిధ సంఘాల నేతలు, ఆయా రంగాల మేధావులు, కవులు, రచయితలతో అంతర్గత చర్చలు జరుపుతున్నామని నిన్న జాగృతి కార్యాలయంలో స్వయంగా కవితే వెల్లడించారు. తెలంగాణలో ఉన్నతమైన ఆశయాలు, లక్ష్యంతో అడుగు వేయాలనే ఆలోచనలో ఉన్నామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమలో సామాజిక తెలంగాణ ఎజెండాతో, కేసీఆర్ హయాంలో చేయకుండా మిలిగిపోయిన పనులను ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే అంశాలతో ముందుకు వెళ్లబోతున్నట్లు చెప్పారు. అయితే రాజీనామా చేసి వారం రోజులు అవుతున్న ఇలాంటి చిన్న చిన్న లీకులు తప్ప తన భవిష్యత్ కార్యాచరణ ఏంటి అన్నదానిపై కవిత పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. తన రాజీనామా ఆమోదం లభిస్తే ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని వివరించి ప్రజాక్షేత్రంలోకి రావాలని చూస్తున్నారని తన రిజిగ్నేషన్ యాక్సెప్ట్ కోసం ఎదురు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

Next Story