కవిత కొత్త పార్టీ తూచ్..! ఇక BRSకు ఈక్వెల్‌గా జాగృతి కార్యకలాపాలు

by Kema Shiva Kumar |

ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారని, జూన్ 2వ తేదీన ప్రకటన చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది.

కవిత కొత్త పార్టీ తూచ్..! ఇక BRSకు ఈక్వెల్‌గా జాగృతి కార్యకలాపాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారని, జూన్ 2వ తేదీన ప్రకటన చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. కానీ కొత్త పార్టీ ఏర్పాటు లేనట్లేనని, ఇకపై తన కార్యకలాపాలన్నీ తెలంగాణ జాగృతి ద్వారానే చేయనున్నట్టుగా ఆమె పరోక్షంగా ప్రకటించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్‌కు సమాంతరంగా ఆమె తన కార్యకలాపాలను జాగృతి ద్వారా కొనసాగించబోతున్నారని స్పష్టమవుతుంది. శనివారం తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా కొత్త పార్టీ లేదని ఆమె పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని రాజకీయ వర్గాల అభిప్రాయం. ఆమె‌కు కొత్త పార్టీ పెట్టే ఉద్దేశం ఉంటే తెలంగాణ జాగృతికి కార్యాలయం, కమిటీలను ఎందుకు ఏర్పాటు చేస్తారని ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

అంతా జాగృతి ద్వారానే..

ఒక రాజకీయ పార్టీగా ఎన్ని కార్యకలాపాలు చేపట్టవచ్చో.. వాటన్నింటినీ జాగృతి ద్వారా చేసి చూపించాలని కవిత నిర్ణయించుకున్నట్టు తెలిసింది. జాగృతికి అనుబంధంగా దాదాపుగా 30 సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిలో కొన్నింటిని ఇప్పటికే ప్రకటించారు. త్వరలో మిగిలిన వాటినీ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి విభాగానికీ సంబంధించి అనుబంధ సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని కోసం ఇప్పటికే జిల్లాల నుంచి ఉత్సాహవంతులైన వారి పేర్లను సేకరించారని, వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలిసింది. ప్రతి వ్యవస్థలో జాగృతి సంస్థ ఉండాలనే ఆలోచనలో ఆమె ఉన్నట్టు తెలిసింది. దీనిలో భాగంగా ఇప్పటికే కీలకమైన బొగ్గుగని సంఘాన్ని ఆమె ఏర్పాటు చేశారు. త్వరలో టీచర్లు, ఆర్టీసీ, ఆటో, తదితర సంఘాలను ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిసింది.

కార్యక్రమాల్లో వేగం

ఈ నెల 2వ తేదీన కవి సమ్మేళనం తరహాలో ఒక కార్యక్రమం నిర్వహించనున్నారు. కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు నిరసనగా 4వ తేదీన ఇందిరా పార్క్​వద్ద ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. అనంతరం జిల్లాల్లో పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. బనకచర్లకు గోదావరి నీటిని తరలించడం, సింగరేణి ప్రయివేటీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై రౌండ్ టేబుల్​సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలిసింది. ఇలా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై స్పందించడం, వారానికి రెండు జిల్లాల్లో, నియోజకవర్గాల్లో పర్యటించాలని ఆమె నిర్ణయించినట్లుగా సమాచారం. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారని తెలిసింది.

జాగృతిని గతం కన్నా బలోపేతం చేయాలని, తాను సైతం బీఆర్ఎస్‌కు సమాంతర వ్యవస్థను నడిపించగలననే సంకేతాలను గులాబీ పార్టీ కీలక నేతలకు, ఇతర రాజకీయ పార్టీలకు పంపించేలా ప్రణాళికలు చేస్తున్నట్టు తెలిసింది. కవిత జిల్లాల్లో పర్యటించినప్పుడు బీఆర్ఎస్​నాయకులు, కార్యకర్తలు ఆమె కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బీఆర్ఎస్​ మీడియా సైతం ఆమె కార్యక్రమాలను కవర్​చేయడం లేదు. ఆమె కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అధిష్టానం నుంచి పార్టీ శ్రేణలుకు స్పష్టతమైన సంకేతాలు అందినట్టు తెలిసింది. గురువారం నిర్వహించిన చిట్​చాట్, శుక్రవారం మంచిర్యాల జిల్లా పర్యటనలను సైతం బీఆర్ఎస్​మీడియా కవర్​చేయలేదు. ఈ నేపథ్యంలో జాగృతిని బలోపేతం చేయడం ద్వారా తన బలాన్ని చూపించాలని కవిత భావిస్తున్నట్టు తెలిసింది.

Next Story