కవిత పార్టీలోకి వలసలు.. TRSలో చేరిన మాజీ మంత్రి

by Prasad Jukanti |

కల్వకుంట్ల కవిత సమక్షంలో మాజీ మంత్రి బోడ జనార్ధన్ టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా సింగరేణి, ఆర్టీసీలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కవిత విమర్శించారు.

కవిత పార్టీలోకి వలసలు..  TRSలో చేరిన మాజీ మంత్రి
X

దిశ, డైనమిక్ బ్యూరో: కల్వకుంట్ల కవిత స్థాపించిన టీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు నేతలు పార్టీ కండువా కప్పుకోగా తాజాగా సీనియర్ నేత, మాజీ మంత్రి బోడ జనార్ధన్ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్‍లో చేరారు. ఇవాళ బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో కవిత ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత అనుభవం కలిగిన నాయకుడిగా బోడ జనార్ధన్ కు పేరుంది. చెన్నూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ఎన్డీఆర్ కేబినెట్ లో మంత్రిగా పని చేసిన అనుభవం అయనకు ఉంది. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత బోడ జనార్థన్ రెడ్డి లాంటి అనుభవం కలిగి నేతలు పార్టీలో చేరడం వల్ల టీఆర్ఎస్‍కు నూతన బలం వచ్చిందన్నారు. వారి అనుభవం, హోదాతో పాటు ఆయన అనుచరులకు తగిన విధంగా పార్టీలో ప్రాధాన్యత ఇస్తామన్నారు.

పరిష్కారం అయ్యేవరకు పోరాడతాం:

సింగరేణి దోపిడీకి గురవుతోందని కవిత విమర్శించారు. ప్రస్తుతం డిపెండెంట్ ఉద్యోగాలను మొత్తం తొలగించే ప్రయత్నం జరుగుతోందన్నారు. సింగరేణికి కొత్త గనులు తెరిచి మన యువతకు కొత్త ఉద్యోగాలు దొరకాలని కోరుతుంటే మరో వైపు భట్టి విక్రమార్క రూపంలో దోపిడీ జరుగతోందన్నారు. ఆర్టీసీని సంపూర్ణంగా ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఓ డ్రైవర్ ఆత్మహత్య చేసుకునే వరకు ఆ ఊసే ఎత్తకుండా టైమ్ పాస్ చేసిందని విమర్శించారు. పేరుకే విలీనం అంటూ కార్మికులకు ఏ కేడర్ ఇస్తారు? వారి విలీన ప్రక్రియ ఏంటి అనేది ఏమీ చెప్పడం లేదన్నారు. వడ్లు కొనాలని ప్రశ్నించిన డ్రైవర్ ను ఉద్యోగం నుంచి తొలగించారని మనమంతా నిలదీస్తే మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుందన్నారు. మాది ఒకటే నినాదం అని ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తామన్నారు.

త్వరలో విప్లవాత్మక ప్రణాళిక:

సబ్బండ తెలంగాణ వర్గాల గతి మారే విధంగా మంచి సామాజిక, ఆర్థిక కోణంలో అభివృద్ధి జరిగేలా విప్లవాత్మక ప్రణాళిక రూపొందిస్తున్నామని తొందరలోనే రాష్ట్ర ప్రజల ముందు ఉంచబోతున్నామన్నారు.

Next Story