కాకపుట్టిస్తున్న కవిత కామెంట్స్.. బీఆర్ఎస్‌ పార్టీలో అలజడి

by Kema Shiva Kumar |

ఇప్పటికే అవినీతి ఆరోపణలతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు పార్టీలోని తాజా పరిస్థితులు తలనొప్పిలా మారాయి.

కాకపుట్టిస్తున్న కవిత కామెంట్స్.. బీఆర్ఎస్‌ పార్టీలో అలజడి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇప్పటికే అవినీతి ఆరోపణలతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు పార్టీలోని తాజా పరిస్థితులు తలనొప్పిలా మారాయి. ఒకవిధంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీలో కుదుపు మొదలైంది. ఇప్పటికే పార్టీలో నెలకొన్న పరిస్థితులపై కేసీఆర్‌ తన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఆ లేఖ లీక్ కావడంతో ఆమె సీరియస్ అయ్యారు. అప్పటి నుంచి పార్టీలో పరిణామాలు మారిపోతున్నాయి. కేసీఆర్ వెంట కోవర్టులున్నారని, దెయ్యాలు తిరుగుతున్నాయని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక అప్పటి నుంచి పార్టీకి, కవితకు మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. తాజాగా ఆమె మరోమారు బీఆర్ఎస్ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

జగదీశ్‌రెడ్డికి స్వీట్ వార్నింగ్

ఆదివారం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత మరోసారి బీఆర్ఎస్ నేతలకు తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. జగదీశ్‌రెడ్డి వల్లే నల్లగొండలో పార్టీ ఓడిపోవాల్సి వచ్చిందని, ఆయన చావుతప్పి కన్నులొట్టపడ్డ చందంగా గెలిచారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఆయనను లిల్లీపుట్‌తో పోల్చారు.

ఎవరా పెద్ద నేత?.. పార్టీలో కలకలం

జగదీశ్‌రెడ్డి వెనుక ఓ పెద్ద నేత ఉండి, ఇటువంటి కామెంట్స్ చేయిస్తున్నారని ఆమె చేసిన ఆరోపణలు పార్టీ నేతల మధ్య తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీ నేతలంతా ఆ పెద్ద నేత ఎవరంటూ చర్చించడం కనిపించింది. ఇప్పటికైనా అధినేత కేసీఆర్ స్పందిస్తారా లేదా అనేదానిపై పలువులు మాట్లాడుకుంటున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అయోమయ పరిస్థితి

ఇప్పటికే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటును సైతం గెలుచుకోలేకపోయింది. అలాగే కాళేశ్వరంపై అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నది. గొర్రెల స్కీమ్ స్కామ్, విద్యుత్ స్కామ్‌ల మీద విచారణలు కొనసాగుతున్నాయి. ఫార్ములా కార్ రేసు పైనా ఎంక్వయిరీ నడుస్తున్నది. గొర్రెల స్కీమ్ స్కామ్‌లో ఈడీ ఎంటర్ అయింది. ఇప్పటికే మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాజీ ఓఎస్డీని అదుపులోకి తీసుకుంది. ఈ వ్యవహారంలో సుమారు వెయ్యి కోట్లకు పైగానే అక్రమాలు జరిగినట్లు ఈడీ తేల్చింది. తాజాగా కవిత చేసిన కామెంట్స్ పార్టీని అయోమయానికి గురిచేశాయి. ఇక ముందు పార్టీలో ఏం జరగబోతున్నది? తమ నేతలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది? అనే దానిపై పార్టీలో చర్చ నడుస్తోంది.

Next Story