- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాట తప్పితే రాళ్లతో కొట్టండి : టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ప్రైవేట్ విద్యాసంస్థలు, ఆసుపత్రుల్లోనూ పేదలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామని ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత మరోసారి తేల్చి చెప్పారు.

- ఉచిత విద్య, వైద్య మా పార్టీ విధానం
- ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రి కావడం మన ఖర్మ
- ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని పట్టించుకోవడం లేదు
- ఫీజుల నియంత్రణ చట్టం ఈ నెలలోనే తేవాలి
- టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ప్రైవేట్ విద్యాసంస్థలు, ఆసుపత్రుల్లోనూ పేదలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామని ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత మరోసారి తేల్చి చెప్పారు. తాను ఇచ్చిన మాటను తప్పితే అమరుల స్థూపం స్తంభానికి క్టటేసి రాళ్లతో కొట్టాలన్నారు. హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య-ఫీజుల నియంత్రణ అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్య, వైద్యం కోసమే తెలంగాణలో ప్రతీ కుటుంబం 70 శాతం ఖర్చు చేసే పరిస్థితి ఉన్నదని అన్నారు. 1,200 మంది ప్రాణ త్యాగం చేసి.. ఎంతో మంది విద్యార్థులు లాఠీ దెబ్బలు తిని రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. సాధించుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఒక సంవేదనతో పాలన చేయాల్సి ఉండేనని చెప్పారు. కానీ.. ఆ పని జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు నియంత్రణ కోసం తిరుపతిరావు కమిషన్ వేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌పై ఒక్క అడుగు ముందుకు వేయలేదన్నారు. ప్రభుత్వం విద్య, వైద్యం అందించడాన్ని ఒక సామాజిక బాధ్యతగా భావిస్తే వాటిని ఉచితంగా అందించడం సాధ్యమేనని చెప్పారు. కానీ.. ప్రస్తుత ప్రభుత్వం ఆ బాధ్యత నుండి తప్పుకుని ప్రజలను వారి కర్మకు వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టటంలో రేవంత్‌రెడ్డి సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు. ఫీజుల దోపిడీ నియంత్రణకు ఈ నెలలోనే చట్టం తేవాలని డిమాండ్ చేశారు.
అలాగే.. ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో అవినీతిపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని తుంగలో తొక్కే కుట్రలను వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని నియంత్రించాల్సిన ముఖ్యమంత్రే ప్రైవేట్ విద్య సంస్థల ప్రారంభోత్సవాలకు వెళ్తూ వారిని ఎంకరేజ్ చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రే మన విద్యాశాఖ మంత్రి కావటం ఖర్మ అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు. త్వరలోనే తమతో కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేస్తామని చెప్పారు. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీవో 7తో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మంగళం పాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని.. పెండింగ్‌లో ఉన్న రూ.11,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో అడ్డగోలు అవినీతి జరుగుతున్నదని కవిత ఆరోపించారు. ఈ అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల్లో కొనసాగుతున్న హెచ్‌పీఎస్ ఈ ఏడాది 120 శాతం ఫీజు పెంచిందని అన్నారు. ప్రభుత్వ స్థలంలో కొనసాగే స్కూల్లోనే ఈ పరిస్థితి ఉంటే.. కార్పొరేట్ స్కూళ్లలో పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దీనికితోడు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైన కొందరు ఏకంగా 30 ఎకరాల క్యాంపస్ భూమిని కబ్జా చేసే పనిలో ఉన్నారని ఆరోపించారు. హెచ్‌పీఎస్ పనితీరుపై సమగ్ర సమీక్ష జరిపి, తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






