దాశరథిని ప్రభుత్వం పట్టించుకోలేదు.. శత జయంతి ఉత్సవాల్లో కె. శ్రీనివాస్, కవిత కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

తెలంగాణ తల్లి అనే మాటను మొట్టమొదటగా వాడింది దాశరథి అని సీనియర్ పాత్రికేయుడు కె శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దాశరథిని ప్రభుత్వం పట్టించుకోలేదు.. శత జయంతి ఉత్సవాల్లో కె. శ్రీనివాస్, కవిత కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ తల్లి అనే మాటను మొట్టమొదటగా వాడింది దాశరథి అని, 1949లో తెలంగాణ తల్లి అనే పదం వాడారని సీనియర్ పాత్రికేయుడు కె శ్రీనివాస్ (Srinivas) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతకంటే మందు ఎవరు తెలంగాణను మాతృభూమిగా, తెలంగాణ తల్లిగా భావించలేదన్నారు. మంగళవారం తెలుగు యూనివర్సిటీలో తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) ఆధ్వర్యంలో దాశరథి శతజయంతి (Dasharathi) ఉత్సవాలు నిర్వహించారు. అగ్నిశిఖ కవితా సంకలనాన్ని ఆయన ఆవిష్కరించారు. సభలో కె శ్రీనివాస్ మాట్లాడుతూ.. నేటి యువతరానికి దాశరథి కనెక్ట్ అవుతారని అన్నారు. నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని దాశరధి అన్నారని, తెలుగు వాళ్లంతా కలిసి ఉండాలని దాశరథి అనుకున్నారని తెలిపారు. ఎన్టీఆర్ ఆస్థాన పదవులు రద్దు చేస్తే దాశరథి పదవి పోయింది.. తెలుగు వారి ఆత్మగౌరవం పేరుతో పార్టీ పెట్టిన ఎన్‌టీఆర్ దాశరథి ఆత్మగౌరవం దెబ్బతీశారని కీలక వ్యాఖ్యలు చేశారు.

దాశరథి తన మరణానంతరం 1995లో తెలంగాణలో ఉద్యమంలో సాంస్కృతిక భావనతో చేరారని చెప్పారు. తెలంగాణ ఉద్యమం అనేది కేవలం రాజకీయ ఉద్యమం కాదని, సాంస్కృతిక, భాషా ఉద్యమం అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక ఉద్యమానిది కీలకపాత్ర అని తెలిపారు. ప్రభుత్వం దాశరథికి చేయాల్సిన విధంగా చేయలేదన్నారు. తెలంగాణ జాగృతి లాంటి సంస్థలు సాంస్కృతిక ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళాయని, దాశరథి శతజయంతి ఉత్సవాలకు కవిత చొరవ తీసుకోవడం మంచి పరిణామం అని కొనియాడారు. ప్రభుత్వం తెలంగాణ కవికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదని, ప్రభుత్వం దాశరథి శత జయంతిని పట్టించుకోలేదని ఆరోపించారు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మాభిమానం పేరుతో అధికారంలోకి వచ్చారని, కవులు,కళాకారులను పదవుల నుంచి తొలగించి వారి ఆత్మాభిమానం దెబ్బతీశారని అన్నారు. టంగుటూరి అంజయ్యకు అవమానం జరిగిందని ఆత్మాభిమానం పుట్టిందన్నారు. టంగుటూరి అంజయ్య భాషను గేలి చేస్తే అంజయ్య మాట్లాడింది అసలైన తెలుగు అని దాశరధి అన్నారని గుర్తుకు చేశారు. దాశరధిని ఆంధ్రా ప్రాంతం కవులతో సమానంగా చూస్తున్నామా? అని ప్రశ్నించారు. దాశరథికి కవిగా రావాల్సిన పేరు రాలేదన్నారు. సినిమా పాటలు రాశారు కాబట్టి దాశరథికి పేరు వచ్చిందన్నారు.

సభలో జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. దాశరథి ఉత్సవాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించలేదు. దాశరథికి ఈ ప్రభుత్వం సరైన గౌరవం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మన వంతుగా మన దాశరథిని గౌరవించుకోవడం మన కర్తవ్యంగా భావించి.. తెలంగాణ జాగృతి ఒక ఉద్యమ సంస్థగా, సంస్కృతిక నేపథ్యాన్ని పరిరక్షించేటటువంటి సంస్థగా మన వంతు కర్తవ్యంతో ఈ సభను తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిజామాబాద్ లో విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సుదీర్ఘకాలం పాటు జర్నలిస్ట్ గా ఉన్నటువంటి కే శ్రీనివాస్‌ని విశిష్ట అతిథిగా పిలవడం జరిగిందని, దాశరధీ సొంత బిడ్డ లక్ష్మణ్ ఈ వేడుకల్లో పాల్గొనడం సంతోషకరమని చెప్పుకొచ్చారు.

Next Story