MLC Kavitha: అదే జరిగితే అక్కడికి రేవంత్ బుల్డోజర్లను పంపించాలి..‘మై హోమ్ విహంగ’ భూములపై కవిత సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |

మైహోం రామేశ్వర్ రావు బీజేపీ మనిషి అని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

MLC Kavitha: అదే జరిగితే అక్కడికి రేవంత్ బుల్డోజర్లను పంపించాలి..‘మై హోమ్ విహంగ’ భూములపై కవిత సంచలన వ్యాఖ్యలు
X

దిశ,తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: హెచ్‌సీయూ భూముల వివాదంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో ‘మై హోమ్ విహంగ’ (My Home Vihanga) నిర్మాణానికి భూములు కేటాయించామనడంలో వాస్తవం లేదన్నారు. ప్రభుత్వ భూముల్లో ‘మై హోమ్’ నిర్మించినట్లయితే సీఎం రేవంత్‌రెడ్డి బుల్డోజర్ల ను పంపించాలని డిమాండ్ చేశారు. కానీ మై హోమ్ రామేశ్వరరావు బీజేపీ మనిషి కాబట్టి రేవంత్‌రెడ్డి ఆ ధైర్యం చేయలేరని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి పేదలు, మూగజీవులపైనే బుల్డోజర్లను ప్రయోగిస్తారు.. పెద్ద వాళ్లను మాత్రం ముట్టుకోరని విమర్శించారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆమె ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా 400 ఎకరాల భూమిని కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. ఆ భూముల పరిరక్షణ కోసం కేసీఆర్ నిర్దేశం మేరకు న్యాయవాదులు కోర్టులో గట్టిగా వాదనలు వినిపించారని గుర్తు చేశారు. ఇది యూనివర్సిటీ భూమి అని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లవద్దన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయ పోరాటం చేసిందన్నారు.

ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో రేవంత్..

ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఉన్నారని కవిత ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చర్యల వల్ల హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయింది కాబట్టి 400 ఎకరాల భూమిని విక్రయించాలని నిర్ణయించారని ఆరోపించారు. యూనివర్సిటీ నుంచి తీసుకున్న భూమిని యూనివర్సిటీకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కాంక్రీట్ జంగిల్‌గా మారిన గచ్చిబౌలి ప్రాంతంలో ఈ 400 ఎకరాల్లో కూడా పెద్ద ఎత్తున కంపెనీలు ఏర్పాటు చేస్తే వాతావరణంపై ఎంత ఒత్తిడి పెరుగుతుందో ఆలోచించాలని ప్రభుత్వానికి సూచించారు.

Next Story