Kavitha: హీరోయిజం చూపిస్తున్నావా?.. ఎక్కడికి రావాలో చెప్పు నేనే వస్తా: రెచ్చిపోయిన కవిత

by Prasad Jukanti |

గాజులరామారం కూల్చివేత్తలపై కవిత హాట్ కామెంట్స్ చేశారు.

Kavitha: హీరోయిజం చూపిస్తున్నావా?.. ఎక్కడికి రావాలో చెప్పు నేనే వస్తా: రెచ్చిపోయిన కవిత
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. అరెకపూడి గాంధీ కబ్జా చేసిన 12 ఎకరాల సంగతేందీ? అని ప్రశ్నించారు. గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతల బాధితులను ఇవాళ కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అరెకపూడి గాంధీ కబ్జా చేసిన 12 ఎకరాలను తొలగించాలన్నారు. కూలీ చేసుకొనే వాళ్ల ఇళ్లను కూల్చేస్తూ హీరోయిజం చూపిస్తున్నారా?అని హైడ్రా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దోళ్లను వదిలి పేదలపై ప్రతాపమా? కోర్టు చెప్పినా సరే ఆదివారం ఇళ్లు కూల్చుతారా? అంటూ హైడ్రాపై ఫైర్ అయ్యారు. పండుగ పూట పేదల ఉసురు తీసుకోకండని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రూ. 50 వేలు తక్షణ సాహయం అందించాలని డిమాండ్ చేశారు. మళ్లీ హైడ్రా బుల్డోజర్ వస్తే నేనే అడ్డుగా నిలుచుంటానని హెచ్చరించారు. వెంచర్లు చేసి అమ్మటంతో చాలా మంది లక్షలు పెట్టి కొనుక్కున్నారు. వాళ్లకు ప్రభుత్వం డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎకరాల కొద్దీ పెద్దవాళ్లు చేసిన కబ్జాలు ప్రభుత్వానికి కనబడటం లేదా? పేదవాళ్ల భూములు మాత్రమే ప్రభుత్వానికి కనబడుతున్నాయా? ముందు వాటిని కూల్చాలన్నారు. వచ్చే నెల 6వ తేదీ లోపు బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వైఎస్ ప్రభుత్వంలో భూములు ఇచ్చారు. ఆనాడే కంచె వేసి ఉంటే ఈ భూములు కబ్జా అయ్యేవి కావన్నారు. పోచమ్మ బస్తీ చుట్టు పక్కల ఉన్న దాదాపు 4 వందల ఎకరాల్లో కబ్జాలు జరిగాయి. చాలా ప్రభుత్వాలు మారినప్పటికీ భూముల రక్షణను పట్టించుకోలేదని హైడ్రా హడావుడిగా వచ్చి పెద్ద వాళ్ల జోలికి పోకుండా...పేదల ఇళ్లను రాత్రికి రాత్రికి కూలగొట్టటం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు ఉన్నారు. మరోపక్క పండుగ ఉంది. ఈ సమయంలో వారి ఇళ్లు కూలగొట్టటం అమానుషం అన్నారు. గతంలోనే కోర్టు శని, ఆదివారాలు ఎవరి జోలికి వెళ్లవద్దని స్పష్టంగా చెప్పింది. వాళ్లకు న్యాయం కోసం కోర్టుకు వచ్చే అవకాశం ఇవ్వాలని కోరింది. అయినప్పటికీ ఆదివారం రోజు ఇళ్లను కూలగొట్టారని మండిపడ్డారు. గ్యాస్ బిల్లు, కరెంట్ బిల్లు ఉన్న వాళ్ల ఇళ్లను కూడా కూలగొట్టారు. పిల్లలు, ముసలి వాళ్లు ఉన్న కూడా పట్టించుకోలేదని పైగా నోటీసులు ఇచ్చామంటూ అబద్దాలు చెబుతున్నారని దుయ్యబట్టారు.

ఇక్కడ మొత్తంగా 200 లోపు కుటుంబాలు మాత్రమే ఉన్నాయని వీరికి డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలన్నారు. బాధితులతో కలిసి వారి వివరాలు తీసుకొని నేనే వస్తా. ఎక్కడకి రమ్మంటారో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రే మున్సిపల్ మంత్రిగా ఉండి గడీలో ఉంటున్నారని ఆఫీస్ కు, సెక్రటేరియేట్ కు రారావడం లేదన్నారు. ఎక్కడ బాధలు చెప్పుకోవాలి. ప్రజా పాలన పేరుతో సమస్యలు చెప్పుకోవాలని అంటున్నారు. రెండేళ్లలో ముఖ్యమంత్రి ఒక్కసారి మాత్రమే ప్రజాపాలన వద్దకు వచ్చారని విమర్శించారు. అసలు ప్రజలు తమ బాధలు ఎవరికీ చెప్పుకోవాలి. బాధితుల వివరాలు తీసుకుంటున్నామన్నారు.

Next Story