- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kavitha: కవిత సంచలనం.. తన నివాసంలో జాగృతి నేతలతో సమావేశం
బీఆర్ఎస్ లో కవిత లేఖాస్త్రం సంచలనంగా మారింది.

దిశ,తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత (Kavitha) లేఖ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే ఉత్కంఠ నెలకొన్న వేళ ఇవాళ ఉదయం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో సింగరేణి ఏరియా జాగృతి (Jagruthi) శ్రేణులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వారితో చర్చించారు. కేసీఆర్‌కు లేఖ, బీఆర్ఎస్‌పై వ్యాఖ్యల తర్వాత జరిగిన కవిత భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఏయే అంశాలపై మాట్లాడబోతున్నారు? ఏదైనా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? అనేది ఉత్కంఠగా మారింది.
కేసీఆర్ రాయబారం ఫలించలేదా?..
కవిత లేఖ ప్రత్యర్థులకు అస్త్రంగా మారబోతున్నదని గ్రహించిన కేసీఆర్ (kcr) రంగంలోకి దిగి తన సన్నిహితులైన ఎంపీ దీవకొండ దామోదరరావు, న్యాయవాది గండ్ర మోహన్‌రావుల ద్వారా తన సమాచారాన్ని కవితకు చేరవేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సందర్భంగా కవిత కూడా తన అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఫోన్‌లో మాట్లాడిన కేసీఆర్ తొందరపడవద్దని కూతురుకు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ బుజ్జగింపుల పర్వం జరిగిన మరుసటి రోజే జాగృతి నేతలతో సమావేశం కావడం ఆసక్తిగా మారింది. రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఆమె ఈ భేటీలో తన అనుచరుల అభిప్రాయాలను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కొత్త పార్టీ పెడతారంటూ జరుగుతున్న ప్రచారం వేళ కేసీఆర్ రాయబారం పని చేసిందా? లేక కవిత తన దారి తాను వెతుక్కోబోతున్నారా? అనేది తేలాల్సి ఉంది.






