TG: కొత్త పార్టీకి ముందే కవిత భారీ స్కెచ్.. మున్సిపల్ ఎన్నికల్లో ఆ గుర్తుతో బరిలోకి జాగృతి?

by Prasad Jukanti |   (  Updated:2026-01-23 10:34:50  IST  )

రాబోయే మున్సిపల్ ఎన్నికల వేళ కల్వకుంట్ల కవిత నిర్ణయాలు ఆసక్తిగా మారాయి.

TG: కొత్త పార్టీకి ముందే కవిత భారీ స్కెచ్.. మున్సిపల్ ఎన్నికల్లో ఆ గుర్తుతో బరిలోకి జాగృతి?
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పొలిటికల్ ఫ్యూచర్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తానని ఇప్పటికే ఆమె ప్రకటించగా తాజాగా ఆమె వేస్తున్న అడుగులు మున్సిపల్ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి నేత‌లు బ‌రిలో దిగుతార‌ని ఇప్పటికే స్పష్టం చేసిన కవిత ఇటీవల హైదరాబాద్‍లోని త‌మ నివాసంలో ఆశావ‌హుల‌తోనూ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇంకా కొత్త పార్టీని అనౌన్స్ చేయని కవిత తన అభ్యర్థులను ఏ గుర్తుపై బరిలోకి దింపబోతున్నారు అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతలతో కవిత భేటీ కావడం ఆసక్తిగా మారింది. రాబోయే మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసమే కవిత తాజా భేటీ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

సింహం గుర్తుతో బరిలోకి జాగృతి?:

ఒంటరిగా వెళ్లి తిరుగులేని శక్తిగా మళ్లీ చట్టసభల్లో అడుగుపెడతానని ఇటీవల శాసనమండలిలో తన చివరి ప్రసంగంలో చెప్పిన కవిత ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తన అభ్యర్థులను బరిలోకి దింపి గెలిపించుకునేందుకు ఆమె ప్రణాళికలు రచిస్తున్నట్లు జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థం అవుతోంది. ఈ క్రమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఇవాళ బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతలతో జాగృతి అధ్యక్షురాలు భేటీ కావడం చర్చనీయంగా మారింది. అయితే ఇటీవల కవిత విషయంలో ఓ అంశం విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. పురపోరులో తమ అభ్యర్థులను సింహం గుర్తు కలిగిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ మద్దతుతో పోటీకి దింపబోతోందని టాక్ వినిపిస్తోంది. ఆ పార్టీ నేతలతో కవిత తాజా సమావేశం వెనుక కూడా రీజన్ ఇదే అనే ప్రచారం జరుగుతోంది.

సింబలే బలం:

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి బలమైన క్యాడర్ లేకపోయినా ఈ పార్టీకి ఉన్న సింబల్ మాత్రం మోస్ట్ పవర్ ఫుల్. ఈ పార్టీకి చెందిన ఎలక్షన్ సింబల్ సింహం గుర్తుపై ఎవరు పోటీ చేసిన ప్రధాన పార్టీలకు టెన్షన్ తప్పదనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో ఉంది. ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఈ పార్టీకి మంచి ట్రాక్ రికార్డు ఉంది. అందుకే టికెట్ రాని, రాదనుకున్న నేతలలో ఎక్కువ మంది సింహం గుర్తు వైపు చూపులు చూస్తుంటారు. దాంతో ఎన్నికల వేళ ఈ పార్టీ బీ ఫామ్‍కు మంచి డిమాండ్ ఉంటూ వస్తోంది. 2018 ఎన్నికల్లో రామగుండంలో కోరుకంటి చందర్ ఇదే పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక 2019లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో 25 ఎంపీటీసి, 2 జట్పీటీసీ స్థానాలను సైతం ఈ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. 2023లో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి 0.6 శాతం ఓట్లతో 8వ స్థానంలో నిలిచింది. అయితే తెలంగాణ రాజకీయాల్లో తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని చూస్తున్న కవితను తెలంగాణ ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారు ఆనేది కాలమే సమాధానం చెప్పనుంది.

Read More... నేతాజీ జయంతి సందర్భంగా సంచలన డిమాండ్.. ప్రధాని మోడీకి కవిత లేఖ

Next Story