- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వికారాబాద్‌లో హోరెత్తిన ఆందోళన.. రైతులతో కలిసి కవిత భారీ ధర్నా
పరిగి ప్రాంతంలో పరిశ్రమల స్థాపన పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యక్ష పోరాటానికి దిగారు.

దిశ, వెబ్‌డెస్క్: పరిగి ప్రాంతంలో పరిశ్రమల స్థాపన పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యక్ష పోరాటానికి దిగారు. బుధవారం వికారాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ఆమె భారీ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ప్రభుత్వం పారిశ్రామికీకరణ ముసుగులో అన్నదాతల పొట్ట కొడుతోందని మండిపడ్డారు. పరిగి నియోజకవర్గంలో సారవంతమైన సాగు భూములను పరిశ్రమల కోసం సేకరించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. "తాతల కాలం నాటి భూములను నమ్ముకుని బతుకుతున్న రైతులను రోడ్డున పడేయడం అన్యాయం. తక్షణమే భూసేకరణ నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలి" అని ఆమె డిమాండ్ చేశారు.
రైతులతో కలిసి బైఠాయింపు...
ధర్నాలో భాగంగా వందలాది మంది రైతులతో కలిసి కవిత ఆర్డీవో కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భూసేకరణ ప్రక్రియను ఆపకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పరిగి ప్రాంతంలో ప్రతిపాదిత పరిశ్రమల కోసం సాగు భూముల సేకరణను నిలిపివేయాలి. రైతుల సమ్మతి లేకుండా ఏ ఒక్క ఎకరా భూమిని తీసుకోవడానికి వీల్లేదు. బలవంతపు భూసేకరణకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భారీ సంఖ్యలో రైతులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు పాల్గొన్నారు. కవిత రాకతో వికారాబాద్ ఆర్డీవో కార్యాలయం పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు.






