TG: తిరిగి బీఆర్ఎస్‌లో చేరికపై కవిత క్లారిటీ

by Gantepaka Srikanth |

పాలమూరుకు తీరని అన్యాయం చేస్తున్నదే రేవంత్ అని కవిత ఆరోపించారు.

TG: తిరిగి బీఆర్ఎస్‌లో చేరికపై కవిత క్లారిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్‌(KCR)ను ఉరి తీయాలని రేవంత్(CM Revanth Reddy) అంటున్నారని.. సీఎంను ఒక్కసారి కాదు రెండు సార్లు ఉరి తీయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) అన్నారు. తన రాజీనామా అంశంపై చర్చించేందుకు కవిత శుక్రవారం చైర్మన్‌ను కలిసేందుకు మండలికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ చేశారు. కేసీఆర్‌ను టెర్రరిస్ట్‌తో పోల్చుతూ రేవంత్ చేసిన విమర్శలకు ఆయన కూతురుగా తన రక్తం మరుగుతున్నదని.. ముఖ్యమంత్రి తన మాట తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. సీఎం మాట్లాడిన మాటలు ఆమోద యోగ్యం కాదన్నారు. పాలమూరుకు తీరని అన్యాయం చేస్తున్నదే రేవంత్ అని ఆరోపించారు. ఉద్యమ నాయకులను పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు.

కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చెప్తే బావుంటుంది..

పాలమూరు-రంగారెడ్డిలో అక్రమాలకు పాల్పడ్డ వారిని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌ను చేయడం అన్యాయమన్నారు. ప్రాజెక్టు సోర్స్ పాయింట్ ఎందుకు మార్చాల్సి వచ్చిందో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చెప్తే బావుంటుందని అన్నారు. హరీశ్‌రావు పాలమూరులో ప్యాకేజ్ అమ్ముకున్నారని.. ఆయన హౌస్‌లో మాట్లాడితే అంతా మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుందని ఆరోపించారు. గతంలో రేవంత్‌రెడ్డితో ఆయన చాంబర్‌లో హరీశ్‌రావు ప్రత్యేకంగా మాట్లాడుకున్నది అందరికీ తెలుసని అన్నారు. అలాంటి వ్యక్తికి నీళ్ల గురించి మాట్లాడే అవకాశం ఇస్తే బీఆర్ఎస్‌కు నష్టమేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్‌పై తనకు మనసు విరిగిందని.. కేసీఆర్ పిలిచినా మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. మొదటి నుండి తాను స్వతంత్రంగా పని చేశానని.. కేసీఆర్ డైరెక్షన్లో హరీశ్, కేటీఆర్ పని చేశారని తెలిపారు. తెలంగాణకు స్వీయ రాజకీయ శక్తి అవసరం ఉన్నదని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ ద్వారా పోటీ చేస్తామని వెల్లడించారు. జాగృతి జనంబాటలో ప్రజల కష్టాలను కళ్ళారా చూస్తున్నానని.. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కొత్త ఒక్క కరెంట్ పోల్ కూడా తండాలకు ఇవ్వడం లేదన్నారు. మిషన్ భగీరథను ఆగం చేశారని.. తాగునీటి కోసం ప్రజలు, గిరిజనులు తండ్లాడుతున్నారని పేర్కొన్నారు.

రాజీనామాకు కారణాలు చెప్పే అవకాశం ఇవ్వండి

తన రాజీనామాకు గత కారణాలను హౌస్‌లో చెప్పే అవకాశం ఇవ్వాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి కవిత విజ్ఞప్తి చేశారు. సుఖేందర్‌రెడ్డిని కలిసి తన రాజీనామా ఆమోదంపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి నాలుగు నెలలైందని.. అయినా ఆమోదించలేదని.. వెంటనే ఆమోదించాలని కోరినట్లు చెప్పారు. ఒకరోజు మండలిలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరగా.. ఈ నెల 5 వ తేదీన నాకు మాట్లాడే అవకాశం ఇస్తామన్నారని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ద్వారా ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదన్నది నూటికి వెయ్యి శాతం నిజమని.. ఇన్ టేక్ పాయింట్ ఎందుకు మార్చారో కేసీఆర్ వివరించాలన్నారు. బబుల్ షూటర్‌కు పెత్తనం ఇచ్చి సమాధానం చెప్పిస్తే ప్రజలకు అర్థం కాదని.. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్‌ను దేవుడు కూడా కాపాడలేడని అన్నారు. ఆంధ్రా నాయకులు రాజకీయాలకు అతీతంగా మన నీళ్లు దోచుకుంటున్నారని.. తెలంగాణ నాయకులకు మాత్రం ఎందుకు ఆ చిత్తశుద్ధి లేదని ప్రశ్నించారు. ఉద్యమ నాయకుడిని కసబ్ లాంటి టెర్రరిస్ట్‌తో పోల్చటం సరికాదని.. రాళ్లతో కొట్టాలి, ఉరి తీయాలంటూ మాట్లాడటమంటే అవి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాటల మాదిరిగా లేవని అన్నారు. మాట్లాడితే పాలమూరు బిడ్డను అని ప్రగల్బాలు పలికే సీఎం ఎందుకు నీళ్లు ఇవ్వలేదన్నారు. ఆంధ్రాలో చంద్రబాబు, జగన్ రాజకీయాలను పక్కన పెట్టి వాళ్ల ప్రాంత ప్రయోజనాల కోసం మన నీళ్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. కానీ తెలంగాణ నాయకుల్లో మాత్రం ఆ చిత్తశుద్ధి లోపించిందన్నారు. మేడిగడ్డకు రిపేర్ చేయకుండా రెండేళ్లపాటు వేలాది మంది రైతులకు అన్యాయం చేశారని.. వాళ్ల కడుపుకోత తగులుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్‌ను బీఆర్ఎస్, బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ తిట్టేందుకే అసెంబ్లీ పెట్టారని.. ఇక్కడ టైమ్ పాస్ చేస్తూ, రీల్స్ చేస్తూ బయటకు వస్తున్నారని అన్నారు.

Next Story