Kavitha episode: కవిత ఎపిసోడ్ తో రెండుగా బీఆర్ఎస్ క్యాడర్!.. సర్పంచ్ ఎన్నికల ముందు కారు పార్టీకి కొత్త టెన్షన్

by Prasad Jukanti |

కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ లో ప్రకంపణలు సృష్టిస్తోంది.

Kavitha episode: కవిత ఎపిసోడ్ తో రెండుగా బీఆర్ఎస్ క్యాడర్!.. సర్పంచ్ ఎన్నికల ముందు కారు పార్టీకి కొత్త టెన్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక దశాబ్ద కాలం తెలంగాణ రాజకీయాలను శాసించిన బీఆర్ఎస్ (BRS) పార్టీలో కవిత రాసిన లేఖ ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది. ఆ పార్టీ చరిత్రలో కవిత ఎపిసోడ్ (Kavitha Episode) భారీ కుదుపుగా మారింది. పార్టీ నేతలంతా బతుకమ్మలా భావించే కవితమ్మ ఒక్కసారిగా బరస్ట్ కావడం కారు పార్టీని కంగారు పెట్టిస్తోంది. మైడియర్ డాడీ అంటూ లేఖతొ మొదలైన ఈ ఎపిసోడ్ నిన్నటి చిట్ చాట్ వరకు అనేక మలుపులు, కుదుపులతో రోజుకో ట్విస్ట్ గా మారింది. పార్టీలో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలతో పార్టీ క్యాడర్ కన్ ఫ్యూజన్ గా మారింది. క్యాడర్ అంతా పార్టీ అధిష్టానం వైపు ఉండాలా లేక కవిత వైపు చూడాలా అనేది ఎటూ తేల్చుకోలేక అయోమయంలో పడిపోతున్నారు. అయితే తెలంగాణ రాజకీయ చరిత్రలో ఎన్నో సవాళ్లను తనదైన చాతుర్యంతో చక్కదిద్దుకున్న కేసీఆర్ ఈ కుదుపు విషయంలో సైలెన్స్ వీడకపోవడం ఇప్పుడు క్యాడర్ కు మరింత అయోమయంలోకి నెట్టుతోందనే చర్చ జోరుగా వినిపిస్తోంది.

'లోకల్' ఎన్నికల్లోపు సర్దుకునేనా?:

కారు పార్టీలో కవిత కామెంట్స్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంటే మరోవైపు సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికలపై (Local Body Elections) ఫోకస్ పెట్టడం గులాబీ పార్టీని మరింత టెన్షన్ పెట్టించే అంశంగా మారింది. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే కాంగ్రెస్ కు షాక్ తప్పదని ఇన్నాళ్లు బీఆర్ఎస్ ప్రచారం చేస్తూ వచ్చింది. ప్రజా వ్యతిరేకత వల్లే ఎన్నికలు నిర్వహించడం లేదని విమర్శలు సైతం గుప్పించింది. అయితే ప్రభుత్వం మాత్రం ముఖ్యమైన పథకాలను అమలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లేలా కసరత్తు చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో జూన్ చివరికి లేదా జూలై తొలివారంలో షెడ్యూల్ రిలీజ్ చేసి పంద్రాగస్టులోపు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో కవిత లేఖ ప్రకంపనలు గులాబీ పార్టీ క్యాడర్ ను టెన్షన్ లోకి నెట్టేసినట్టైంది. రాష్ట్రంలో రాబోయే ఏ ఎన్నిక అయినా గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేసిన కారు పార్టీ శ్రేణులు తాజా పరిణామాలతో డైలామాలో పడినట్లు చర్చ జరుగుతోంది. తాజా పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే అంతలోపు సర్దుకుంటుందా? లేక ఈ పరిణామాలు ప్రత్యర్థులకు ఆయుధంగా మారింది పార్టీని మరింత డ్యామేజ్ చేస్తాయా అనేది చర్చనీయాశంగా మారింది.

కాంగ్రెస్ చేతికి ఆయుధం:

లేఖాస్త్రంతో కవిత సొంతపార్టీపై చేసిన ఆరోపణలు, సంధించిన ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ను బీజేపీతో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కవిత చెప్పడం ఇది నిజమేనని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పడం కాంగ్రెస్ (Congress) అనుకూలంగా మారబోతున్నదనే టాక్ వినిపిస్తోంది. నిజానికి బీఆర్ఎస్ లో ఎవరి వర్గాలు ఎన్ని ఉన్నా ఆ పార్టీకి ముస్లిం, క్రిస్టియన్స్ సైతం పెద్ద సంఖ్యలో మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. బీజేపీతో బీఆర్ఎస్ సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ చాలా కాలంగా ప్రచారం చేస్తున్నా కేసీఆర్ పై ఉన్న అభిమానంతో ఈ రెండు వర్గాలు ఈ వాదనను ఇన్నాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ రెండు పార్టీల మధ్య అండర్ స్టాండింగ్ వ్యవహారాలు నిజమేనని స్వయంగా కవిత చెప్పడంతో ఇప్పుడీ వర్గాలు బీఆర్ఎస్ వెంట ఏ మేరకు మద్దతుగా ఉంటాయనేది ఆసక్తిగా మారింది. అసలే అధికారం లేక అవస్థలు పడుతున్న గులాబీ పార్టీని తాజా పరిణామాలు ఎటువైపు తీసుకువెళ్తాయో చూడాలి మరి.

Next Story