Kavitha: రేపు ఢిల్లీకి కవిత.. హస్తిన వేదికగా మీడియా సమావేశం

by Prasad Jukanti |   (  Updated:2025-07-07 06:37:04  IST  )

బీసీ రిజర్వేషన్ పై కవిత తన పోరాటాన్ని మరింత ముమ్మరం చేస్తున్నారు

Kavitha: రేపు ఢిల్లీకి కవిత.. హస్తిన వేదికగా మీడియా సమావేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలనే డిమాండ్ తో పోరాటం చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (Kavitha) పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆమె రేపు ఢిల్లీకి (Kavitha Delhi Tour) వెళ్లనున్నారు. అక్కడ పలువురు జాతీయ నేతలతో భేటీ అయి అనంతరం హస్తిన వేదికగా మీడియా సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. బీసీ బిల్లు తీసుకురావాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జులై 17న జాగృతి ఆధ్వర్యంలో రైల్ రోకో చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో మద్దతు కోసం కవిత ఇప్పటికే పలు పార్టీలు, సంస్థల అగ్రనాయకులను కలిసి మద్దతు కూడగడుతన్నారు. ఈ క్రమంలో రేపు ఢిల్లీ పర్యటన ఆసక్తిగా మారింది.

జాతీయ నేతలతో భేటీ:

ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రాందాస్ అథావాలే కవితతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రే స్వయంగా కవిత నివాసానికి వెళ్లి ఎమ్మెల్సీతో గంటకుపైగా చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన బీసీ బిల్లును ఆమోదింప చేయాలని కోరుతూ అథావాలేకు కవిత వినతిపత్రం ఇచ్చారు. అంతకు ముందు మరో కేంద్ర మంత్రి జయంత్ చౌదరి, కవిత భేటీ అయినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రేపు ఢిల్లీ వేళ్లనున్న కవిత అక్కడ కేంద్ర మంత్రులు, పలువురు జాతీయ నేతలతో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లగా రేపు కవిత హస్తినాకు బయలుదేరనున్నారు. దీంతో తాజా పరిణామాలు స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.

Next Story