అత్యంత అవినీతిపరుడు మీ పక్కనే ఉన్నాడు... సీతక్కపై కవిత విమర్శలు

by Prasad Jukanti |   (  Updated:2026-03-17 08:49:24  IST  )

స్త్రీనిధిలో అవినీతిని సహించమన్న మంత్రి సీతక్క వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు గుప్పించారు. వివాదాస్పద ఎండీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

అత్యంత అవినీతిపరుడు మీ పక్కనే ఉన్నాడు... సీతక్కపై కవిత విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్త్రీనిధిలో అవినీతిని సహించమంటూ మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శలు గుప్పించారు. అత్యంత అవినీతిపరుడిని పక్కన కూర్చోబెట్టుకొని స్త్రీనిధిలో అవినీతి, అక్రమాలను సహించబోమని సీతక్క మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రిజర్వ్ బ్యాంక్, కో ఆపరేటివ్ సొసైటీస్ నిబంధనలకు విరుద్ధంగా 15 ఏళ్లుగా స్త్రీనిధి ఎండీగా కొనసాగుతున్న వ్యక్తిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు సీతక్క చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దిశ దినపత్రికలో వచ్చిన పేపర్ క్లిప్పును కవిత ఎక్స్ లో షేర్ చేశారు. వివిధ కారణాలతో మీ ప్రభుత్వం 16 మంది స్త్రీనిధి ఉద్యోగులను సర్వీస్ నుంచి రిమూవ్ చేసింది. మరి అత్యంత అవినీతిపరుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఇంకా ఉన్నత స్థానంలో కొనసాగించడం వెనుక ఆంతర్యం ఏమిటి? అని కవిత నిలదీశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే స్త్రీనిధిలో అక్రమాలకు మూల పురుషుడిగా ఉన్న వ్యక్తిపై చర్యలు తీసుకుంటున్నట్టు మీరు ప్రకటన చేయాలి. అప్పుడే అవినీతి, అక్రమాలను సహించబోమన్న మీ ప్రకటన పై ప్రజలకు విశ్వాసం కలుగుతుందన్నారు.

కాగా స్త్రీనిధి నిధులను వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నా, అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తప్పవని మంత్రి సీతక్క నిన్న సచివాలయంలో స్త్రీ నిధి సంస్థ పురోగతిపై సమీక్షలో వ్యాఖ్యానించారు. మహిళలు ఆర్థికంగా బలపడితేనే సమాజ అభివృద్ధి సాధ్యం అని, ఆ దిశగా స్త్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకోవాలి సూచించారు.

Next Story