విద్యార్థుల విజయాన్ని సీఎం ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటు : టీఆర్ఎస్ చీఫ్ కవిత

by Naga Rani Yarlagadda |

36 రోజులపాటు ఉద్యమం చేసి కేంద్రం దిగి వచ్చేలా విద్యార్థులు చేశారని.. తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్రమంత్రి రాజీనామా చేయాల్సిన స్థితి తెచ్చారని.. ఈ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవటానికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నించటం సిగ్గుచేటని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.

విద్యార్థుల విజయాన్ని సీఎం ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటు : టీఆర్ఎస్ చీఫ్ కవిత
X
  • యువత హామీలపై ఎక్కడ నిలదీస్తారోనని ఊరేగింపులు
  • మాట నిలబెట్టుకోకపోతే మిమ్మల్ని గద్దె దించటం ఖాయం

దిశ, తెలంగాణ బ్యూరో: 36 రోజులపాటు ఉద్యమం చేసి కేంద్రం దిగి వచ్చేలా విద్యార్థులు చేశారని.. తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్రమంత్రి రాజీనామా చేయాల్సిన స్థితి తెచ్చారని.. ఈ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవటానికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నించటం సిగ్గుచేటని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఇది వెయ్యి శాతం విద్యార్థులు సాధించిన ఘన విజయమని పేర్కొన్నారు. విద్యార్థుల ఘనతను తాము సాధించినట్లు నాలుగు గంటలపాటు నగర వీధుల్లో సీఎం సహా కాంగ్రెస్ నాయకులు ఊరేగింపు చేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఫెయిల్యూర్స్‌ను విద్యార్థులు ఎక్కడ నిలదీస్తారోనని ముందుగానే సీఎం బయటకు వచ్చి ఊరేగింపులు చేశారని ఆరోపించారు. విద్యార్థులు, యూత్‌ను పట్టించుకోని సీఎం.. 21 ఏళ్లుకే యువత పార్లమెంట్‌లో ఉండేలా బిల్లు తెస్తామని చెబుతున్నారని తెలిపారు. 21 ఏళ్లకే పార్లమెంట్‌లో యువతకు అవకాశం కల్పించాలన్న జ్ఞానోదయం కలగటం సంతోషమే అయినప్పటికీ యువతకు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్‌మెంట్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అందుకే మిమ్మల్ని యువత నమ్మే అవకాశం లేదని తెలిపారు. అసెంబ్లీలో ఏ బిల్లు పెట్టినా కేంద్రం వద్ద ఆ బిల్లు పాస్ కాకుండా లాలూచీ పడుతున్నారని.. ఆ విషయం బీసీలకు, తెలంగాణ ప్రజలకు బాగా తెలుసని పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి అట్టహాసంగా వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆరోపించారు. కొవ్వొత్తులు పట్టుకొని ఉరేగితే విద్యార్థులు నమ్మరని.. మీ చరిత్ర అందరికీ తెలుసని పేర్కొన్నారు. ఇకనైనా యువతకు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఇదే యువత గద్దె దించుతారని హెచ్చరించారు.

Next Story