Kavitha: కేసీఆర్ దమ్మెందో ఒరిజినల్ కాంగ్రెస్ కు తెలుసు.. అసెంబ్లీలో చర్చ పెట్టు.. రేవంత్ రెడ్డికి కవిత సవాల్

by Prasad Jukanti |   (  Updated:2025-06-25 07:44:28  IST  )

చంద్రబాబును పిలిచి బిర్యాని పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్ గా ఇచ్చింది రేవంత్ రెడ్డినే అని ఎమ్మెల్సీ కవిత ఆరోపంచారు.

Kavitha: కేసీఆర్ దమ్మెందో ఒరిజినల్ కాంగ్రెస్ కు  తెలుసు.. అసెంబ్లీలో చర్చ పెట్టు.. రేవంత్ రెడ్డికి కవిత సవాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో/ కార్వాన్: అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఆరు గ్యారెంటీల అమలు, మహిళలకు కాంగ్రెస్ చేసిన మోసంపై చర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (MLC Kavitha) సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబును పిలిచి హైదరాబాద్ బిర్యాని పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్ గా ఇచ్చారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) అబద్ధాలు ఆడడం అలవాటైందని 2016లో పోలవరం, బనకచర్ల అంశమే లేదన్నారు. మహిళలకు రూ. 2500, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీకి ఆబిడ్స్ జీపీవో నుంచి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత.. గోదావరి అంశంపై అసెంబ్లీలో చర్చకు రావాలని మాజీ సీఎం కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ పై స్పందించారు. 'యస్.. అసెంబ్లీలో చర్చ పెడుదాం... ఆరు గ్యారెంటీల అమలు, మహిళలను మోసం చేసినదానిపై చర్చిద్దాం. కేసీఆర్ దమ్మెంతో అన్నది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చింది కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు' అన్నారు. అది మరిచిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడడం బాధాకరం అన్నారు. రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరించాలన్నారు. కేసీఆర్ (KCR) కలలో కూడా తెలంగాణకు నష్టం చేయరని. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరన్నారు.

సోనియాగాంధీ మొహం చూసి ఓట్లేస్తే మోసం:

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరు గ్యారెంటీలపై సోనియా గాంధీ సంకతం పెట్టిన గ్యారెంటీ కార్డులను ఇంటింటికి పంచారు. సోనియాగాంధీ (Sonia Gandhi) మొహం చూసి ఓట్లేసిన మహిళలను, వృద్ధులను, వికలాంగులు మోసం చేశారని కవిత ధ్వజమెత్తారు. అందుకే పెన్షన్ల మొత్తాన్ని పెంచేలా రేవంత్ రెడ్డికి ఆదేశాలివ్వాలని సోనియా గాంధీని కోరుతూ వేలాది పోస్టుకార్డులు (Post Card Movement) సోనియా గాంధీకి పంపుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయినా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని వృద్ధులకు రూ.2 వేల పెన్షన్ ను రూ.4 వేలు చేస్తామన్న హామీని విస్మరించాని ధ్వజమెత్తారు. వికలాంగుల పెన్షన్ ను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచకుండా మోసం చేశారని విమర్శించారు. మహిళలకు నెలకు రూ 2500 ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.

Next Story