తెలంగాణ జాగృతి చీఫ్ కవిత అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-19 10:51:06  IST  )

ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (Kavitha) తన కార్యకర్తలు, హెచ్‌ఎంఎస్ సింగరేణి యూనియన్ నాయకులతో కలిసి ఇవాళ నగరంలోని సింగరేణి భవన్‌ను ముట్టడించారు.

తెలంగాణ జాగృతి చీఫ్ కవిత అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత
X

దిశ, వెబ్‌డెస్క్: ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (Kavitha) తన కార్యకర్తలు, హెచ్‌ఎంఎస్ సింగరేణి యూనియన్ నాయకులతో కలిసి ఇవాళ నగరంలోని సింగరేణి భవన్‌ను ముట్టడించారు. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన పోలీసులు ముట్టడిని అడ్డుకున్నారు. సింగరేణి భవన్‌ ఎదుట బైఠాయించిన కవితతో పాటు పలువురు నాయకులను అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు.

ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. తెలంగాణలోని బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలన్నారు. కొత్త బ్లాకులను సింగరేణికి మాత్రమే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇది సింగరేణి సంస్థ ఆర్థిక స్థిరత్వానికి కీలకమని కామెంట్ చేశారు. అదేవిధంగా సింగరేణి కార్మికుల జీతాల నుంచి ఆదాయపు పన్ను వసూళ్లను ఆపాలని.. దీంతో కార్మికులపై భారం తగ్గుతుందని పేర్కొన్నారు. సింగరేణి పరిధిలోని ప్రతి కాంట్రాక్ట్‌లో 25 శాతం అవినీతి జరుగుతోందని, 10 శాతం వాటా కాంగ్రెస్ నాయకులకు వెళ్తోందని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించకపోతే సీబీఐకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇక రెండేళ్లుగా మెడికల్ బోర్డు కోసం కార్మికులతో కలిసి పోరాడుతున్నామని, ఇది వారి ఆరోగ్యానికి ఎంతో అవసరమని అన్నారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలను కూడా తీసేయడం దారుణమని కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు.

Next Story