ఆగస్టు 6న భారీ బహిరంగ సభ : టీఆర్ఎస్ చీఫ్ కవిత

by Naga Rani Yarlagadda |

బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు ఆగస్టు 6న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు.

ఆగస్టు 6న భారీ బహిరంగ సభ : టీఆర్ఎస్ చీఫ్ కవిత
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు ఆగస్టు 6న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సోమవారం బంజారాహిల్స్‌లోని టీఆర్ఎస్ ఆఫీస్‌లో నిర్వహించిన పార్టీ బీసీ నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధనకు సంకల్పం తీసుకుంటామని తెలిపారు. ‘సామాజిక న్యాయ తెలంగాణ సాధన సభ’ పేరుతో ఈ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. బీసీలతోపాటు సమాజంలోని అన్నివర్గాల వారిని ఒక్కతాటిపైకి తీసుకొచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతామన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ జాగృతి, టీఆర్ఎస్ రెండేళ్లుగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాయని గుర్తు చేశారు. హైదరాబాద్ వేదికగా నిర్వహించే సభ దేశ గతినే మార్చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తమిళనాడులోని స్కూళ్లలో ఎన్జీఆర్ ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధన కోసం చేసే ఉద్యమాలకు హైదరాబాద్ సభ దిక్సూచీగా నిలుస్తుందన్నారు. తమ ఉద్యమాలకు తలొగ్గే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా రెండు వేర్వేరు బిల్లులు అసెంబ్లీ, కౌన్సిల్‌లో పాస్ చేసి కేంద్రానికి పంపిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లులకు ఆమోదం తెలిపేలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస ప్రయత్నాలు కూడా చేయడం లేదన్నారు. మనమెంతో మనకంత అనే నినాదం సాకారం కావాలంటే అన్ని వర్గాలను కలుపుకొని 50 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఐక్య ఉద్యమాలు చేద్దామని పిలుపునిచ్చారు.

Next Story