Kavitha vs KTR: నన్నే తొలగిస్తారా.. ఇక కాస్కోండి.. కేటీఆర్ పై కవిత బిగ్ స్కెచ్!

by Prasad Jukanti |   (  Updated:2025-08-24 06:56:25  IST  )

బీఆర్ఎస్ లో కవిత వర్సెస్ కేటీఆర్ అంశం రోజు రోజుకు దుమారం రేపుతోంది.

Kavitha vs KTR: నన్నే తొలగిస్తారా.. ఇక కాస్కోండి.. కేటీఆర్ పై కవిత బిగ్ స్కెచ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు రాష్ట్ర రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత (Kavitha) అంశం ఆ పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీకేఎస్‌) అధ్యక్షురాలిగా పదేళ్లకు పైగా ఉన్న కవితను ఇటీవల అనూహ్యంగా ఆ పదవి నుంచి అధిష్టానం తొలగించింది. ఆమె స్థానంలో కొప్పుల ఈశ్వర్‌ను ఇన్ చార్జిగా నియమించినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. ఈ పరిణామాలపై స్పందించిన కవిత నాపై కక్ష గట్టారు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతున్న వేళ జాతీయ కార్మిక సంఘమైన హిందూ మజ్దూర్ సభ (హెచ్ఎంఎస్) సంచలన ప్రకటన చేసింది. హెచ్ఎంఎస్ లోకి కవితను ఆహ్వానించింది. కవితను హెచ్ఎంఎస్ గౌరవాధ్యక్షురాలుగా ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్‌ అహ్మద్‌ తెలిపారు. సింగరేణి జాగృతి, హెచ్ఎంఎస్ కలిసి సింగరేణిలో (Singareni) పని చేయాలని నిర్ణయించుకున్నాయని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో ఈ నెల 30, 31 తేదీల్లో నిర్వహించే జనరల్‌ బాడీ సమావేశంలో ఏకగ్రీవ ఎన్నిక జరుగనుందని వివరించారు. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులకు నాందికాబోతున్నదా అనే చర్చ తెరపైకి వస్తోంది.

కేటీఆర్ వర్సెస్ కవిత:

బీఆర్ఎస్ పార్టీలో తన పట్ల జరుగుతున్న పరిణామాలపై కవిత బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రికి రాసిన లేఖ బహిర్గతం అయిన నాటి నుంచి పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేసీఆర్ పక్కన దెయ్యాలు ఉన్నాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత పలువురు బీఆర్ఎస్ నేతలపై కవిత రియాక్ట్ అయిన తీరు పార్టీలో అలజడి రేపుతోంది. ముఖ్యంగా గత కొంత కాలంగా కేటీఆర్ వర్సెస్ కవిత మధ్య సాగుతున్న పొలిటికల్ వార్ ముదురుపాకాన పడుతోందనే చర్చ జరుగుతోంది. కేటీఆర్ విషయంలో రోజు రోజుకు వాయిస్ పెంచుతున్న కవిత.. పార్టీలో ముఖ్యమైన హోదాలో ఉండి కేవలం ట్వీట్లకే పరిమితం అయితే సరిపోతుందా అని పరోక్షంగా కేటీఆర్ ను నిలదీసిన తీరు సంచలనం రేపాయి. తనకు నీతులు చెప్పే వారికి పార్టీని నడిపించే సత్తా లేదంటూ చేసిన కామెంట్స్ దుమారం గా మారాయి. ఈ క్రమంలో కవిత విమర్శల దాడి పెంచుతున్న నేపథ్యంలో ఆమెను టీబీకేఎస్‌ అధ్యక్షురాలి పదవి నుంచి కేటీఆర్ తొలగించడం బీఆర్ఎస్ లో బిగ్ ట్విస్ట్ గా మారింది. అయితే టీబీకేఎస్ ప్రెసిడెంట్ గా కవితను తప్పించిన వెంటనే గౌరవ అధ్యక్షురాలిగా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు హెచ్‌ఎంఎస్ (Hindu Mazdoor Sabha) ముందుకు రావడం ఆసక్తిని రేపుతోంది. కవిత ఈ ప్రతిపాదనను అంగీకరిస్తే ఇక పైకి ఇది సింగరేణి కార్మిక సంఘం అంశమే అయినా అంతర్గతంగా కవిత వర్సెస్ కేటీఆర్ గా మధ్య జరిగే ఎత్తుకు పై ఎత్తుగా ఉండబోతున్నదనే చర్చ జరుగుతోంది. తనను పదవి నుంచి తప్పించిన కేటీఆర్ పై కవిత ఈ మరో సంస్థ ద్వారా రివేంజ్ తీసుకోబోతున్నారా అనేది ఆసక్తిగా మారింది.

అమెరికా నుంచి వచ్చాక బిగ్ బ్లాస్ట్!:

ప్రస్తుతం కవిత అమెరికా పర్యటనలో ఉన్నారు. తన చిన్న కుమారుడు ఆర్యను గ్రాడ్యుయేషన్ కోసం కాలేజీలో చేర్పించేందుకు ఈ నెల 16వ తేదీన యూఎస్ వెళ్లారు. విదేశానికి పయనం అయ్యే ముందు చిన్న కుమారుడితో పాటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ వెళ్లిన కవిత అక్కడ తన కుమారుడికి తాత కేసీఆర్ ఆశీర్వాదం ఇప్పించారు. ఈ పర్యటన ముగించుకుని సెప్టెంబర్ 1న ఆమె తిరిగి రాష్ట్రానికి రాబోతున్నారు. గతంలో అమెరికా పర్యటనలో ఉండగానే తాను కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ అయింది. అది కాస్త తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈసారి అమెరికాలో ఉన్న సమయంలోనే టీబీకేఎస్‌ (TBGKS) పదవి నుంచి తప్పించడం సెన్సేషనల్ గా మారింది. దీంతో ఈసారి అమెరికా నుంచి కవిత తిరిగి వచ్చాక బీఆర్ఎస్ లో బిగ్ బ్లాస్ట్ ఉండబోతున్నదనే గుసగుసలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ జాగృతి పేరుతో కార్యకలాపాలు విస్తృతం చేస్తున్నారు. అయితే తాజా పరిణామాటలపై తీవ్ర స్థాయిలో రగిలిపోతున్న కవిత ఈ సారి ఎలాంటి డెసిషన్ తో రాబోతున్నారు అనేది ఉత్కంఠ రేపుతోంది.

Next Story