- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మత్తులో యువత చిత్తు.. మాదకద్రవ్యాల ముప్పులో భవిష్యత్తు తరం
పెద్దపెల్లి జిల్లాలో గంజాయి అక్రమ విక్రయాలు పెరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దిశ, పెద్దపల్లి : నేటి సమాజంలో యువత ఎదుర్కొంటున్న అత్యంత ప్రమాదకరమైన సమస్యల్లో మాదకద్రవ్యాల వ్యసనం ఒకటి. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు క్షణిక ఆనందాన్ని ఇచ్చినట్లే కనిపించినా, దీర్ఘకాలంలో యువత జీవితాలను చిత్తుగా మార్చేస్తున్నాయి. చదువు, ఉద్యోగం, కుటుంబం, ఆరోగ్యం అన్నీ మత్తు మాయలో కొట్టుకుపోతున్నాయి. ఈ విష వలయంలో చిక్కుకుంటున్న యువత సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలు మొదట్లో కేవలం సరదాగా మొదలవుతాయి. కానీ కొద్ది రోజులకే అవి అవసరంగా మారిపోతాయి. మానసిక ఒత్తిడి, డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలు కూడా కలుగుతాయి. యువకులు తాము చేస్తున్నది తప్పేనని తెలిసినా ఆ అలవాటును వదిలిపెట్టలేని స్థితికి చేరుకుంటారు.మత్తు పదార్థాలకు అలవాటు పడిన యువత క్రమంగా చట్టవిరుద్ధ కార్యకలాపాల్లోకి అడుగుపెడుతున్నారు. డబ్బుల కోసం దొంగతనాలు, గొడవలు, హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న సంఘటనలు పెరుగుతున్నాయి. కొందరు యువకులు డ్రగ్స్ సరఫరా చేసే ముఠాల చేతిలో పావులుగా మారిపోతున్నారు.
పెద్దపెల్లి జిల్లాలో జోరుగా విక్రయాలు..
ఇటీవల పెద్దపెల్లి జిల్లాలో గంజాయి అక్రమ విక్రయాలు పెరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి సరఫరా జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. పాఠశాలలు, కళాశాలల పరిసరాలు, బస్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద ఈ అక్రమ వ్యాపారం కొనసాగుతోందని సమాచారం. పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నప్పటికీ, గంజాయి మాఫియా కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటూ తప్పించుకుంటోంది. చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తూ, సోషల్ మీడియా, మొబైల్ యాప్‌ల ద్వారా డీల్స్ నిర్వహించడం వంటి కొత్త పద్ధతులు ఆందోళన కలిగిస్తున్నాయి. పోలీసులు అక్రమ రవాణాపై నిఘా పెంచాలి.
పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువతకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై స్పష్టత ఇవ్వాలి.యువత మత్తు పదార్థాల వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితుల్లో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకం. పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనించాలి. చదువుపై ఆసక్తి తగ్గడం, ఒంటరిగా ఉండటం, అసహనంగా ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. యువత తమ భవిష్యత్తును తామే నాశనం చేసుకోకుండా, సమాజం వారికి మార్గనిర్దేశం చేయాలి. మత్తు మాయకు బానిసలవుతున్న యువతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇప్పటికైనా అప్రమత్తం కాకపోతే రేపటి తరానికి మిగిలేది చిత్తైన భవిష్యత్తే.






