- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బొందల గడ్డలో జాగేది..? అధికారులు స్పందిస్తేనే అంతిమయాత్ర సుగమం
ఎల్లారెడ్డి పేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పలు కులాలకు సంబంధించిన వారు చనిపోతే ఖననం చేయడానికి బొందల గడ్డ (స్మశాన వాటిక)లో జాగలేక ఇబ్బందులు పడుతున్నారు.

దిశ, ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డి పేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పలు కులాలకు సంబంధించిన వారు చనిపోతే ఖననం చేయడానికి బొందల గడ్డ (స్మశాన వాటిక)లో జాగలేక ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలో సుమారు 500 లకు పైగా ముస్లిం కుటుంబాలు నివాసముంటున్నాయి. సుమారు 50 సంవత్సరాల క్రితం ముస్లింలు ఎవరైనా చనిపోతే వారి ఆచార సాంప్రదాయం ప్రకారం ఖననం (బొంద) పెట్టడానికి సుమారు రెండు ఎకరాలకు పైగా భూమిని కొనుగోలు చేశారు. ఇది ఇప్పటికే వారి కుటుంబాల్లో చనిపోయిన వారినీ ఖననం చేయగా పూర్తిగా నిండిపోయింది. ఇంకా స్థలం కొరత ఏర్పడగా తాజా మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి సుమారు 20 గుంటల భూమిని ముస్లింలకు తన సొంత డబ్బులతో కొనుగోలు చేసి ఇచ్చాడు.
అయిన ఎల్లారెడ్డి పేట సిరిసిల్ల - కామారెడ్డి ప్రధాన రహదారినిyellareddypet ఆనుకుని ఉండడంతో బతుకు దెరువు కోసం అనేక మంది ముస్లిం లు ఎల్లారెడ్డి పేట కు వస్తున్నారు. వీరు చనిపోతే ఖననం చేయడానికి స్థలం కొరత ఏర్పడి ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గా నియమితులైన అజ్మతుల్ల హుస్సేన్ ని తమకు ఖబ్రస్థాన్ కోసం స్థలం కావాలని ముస్లింలు కలువగా స్థలం ఇప్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అదే విధంగా ఆరె కటిక లు కూడా చనిపోతే వారిని కూడా ఖననం చేస్తున్నారు. వీరిని ఖననం చేయడానికి స్థలం కొరత ఉంది. అదే విధంగా గ్రామంలో గల ఒడ్డెర కులస్తులు ఎవరైనా చనిపోతే ఇప్పటివరకు వారి సొంత వ్యవసాయ పొలాల్లో ఖననం చేసుకుంటున్నారు. వీరి కుటుంబాల్లో చాలా మందికి సొంత వ్యవసాయ పొలాలు లేకపోవడంతో చనిపోతే అంత్యక్రియలు నిర్వహించి ఖననం చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. వీరితో పాటుగా ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలో ఏడు చర్చీలు ఉన్నాయి.
క్రిస్టియన్ కుటుంబాలు సుమారు ఆరు వందల వరకు ఉన్నాయి. వీరు చనిపోతే మండల కేంద్రంలో గల గిద్దె చెరువు కట్ట దగ్గర కొన్ని సంవత్సరాలుగా ఖననం చేసి సమాధులు సైతం కడుతున్నారు. ప్రతి సారి గిద్దే చెరువు నిండడంతో సమాధులు నీట మునిగి కొన్ని కొట్టుకుపోయి ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఏడాదికోసారి సంవత్సరీకానికి వెళ్ళి ప్రార్థనలు చేసి వద్దామని అనుకుంటే సమాధుల ఆనవాళ్లు లేకుండా పోవడంతో వారి కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. సుమారు 20 సంవత్సరాల నుండి ప్రతి రాజకీయ నాయకుడిని కలిసి క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడానికి సమాధుల తోట కావాలని అడుగుతున్నారు. ఇక్కడి నుండి శాసన సభ్యులు గా ఎన్నికైన మాజీ మంత్రి, శాసన సభ్యులు కేటీఆర్ ను కలిసి పలు చర్చి ల పాస్టర్ లు విన్నవించుకున్నారు. అయినా ఫలితం దక్కలేదు.
బతుకు దెరువు కోసం ఎల్లారెడ్డిపేటకు వచ్చిన చాలా మంది అభాగ్యులు చనిపోతే వారిని ఖననం చేయడానికి స్థలం లేకపోవడంతో గిద్దె చెరువు కట్ట కింద ఖననం చేస్తున్నారు. కాగ ఇలా ఖననం చేయడం పై మృతదేహాలు వర్షం ధాటికి కొట్టుకుని వస్తే తమ పంట పొలాల్లో ఎముకలు కాళ్ళకు గుచ్చుకుని ఇబ్బందులు పడతామని రైతులు ఇక్కడ ఖననం చేయడానికి అభ్యంతరం తెలుపుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి పలు కులాలకు అంత్యక్రియల కోసం ప్రభుత్వ స్థలం అందించి అంత్యక్రియలు జరిగేలా చూడాలని కోరుతున్నారు.






