కిక్కులేని వైన్స్ టెండర్లు.. రెండింతలు తగ్గిన దరఖాస్తులు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-10-18 02:33:47  IST  )

జిల్లాలో నిర్వహిస్తున్న వైన్స్ టెండర్లు కిక్కు లేకుండా కొనసాగుతున్నాయి. మద్యం టెండర్లపై వ్యాపారస్తులు మక్కువ చూపునట్లు తెలుస్తోంది. గతంలో కంటే దరఖాస్తులు రెండింతలు తగ్గాయి. గతంలో రెండువేలకుపైగా దరఖాస్తులు రాగా, ప్రస్తుతం నిన్నటి వరకు వెయ్యిలోపే దరఖాస్తులు వచ్చాయి.

కిక్కులేని వైన్స్ టెండర్లు.. రెండింతలు తగ్గిన దరఖాస్తులు
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో నిర్వహిస్తున్న వైన్స్ టెండర్లు కిక్కు లేకుండా కొనసాగుతున్నాయి. మద్యం టెండర్లపై వ్యాపారస్తులు మక్కువ చూపునట్లు తెలుస్తోంది. గతంలో కంటే దరఖాస్తులు రెండింతలు తగ్గాయి. గతంలో రెండువేలకుపైగా దరఖాస్తులు రాగా, ప్రస్తుతం నిన్నటి వరకు వెయ్యిలోపే దరఖాస్తులు వచ్చాయి. అధికంగా సేల్స్ ఉన్న వైన్స్ లపై మాత్రమే వ్యాపారస్తులు మోగ్గు చూపుతున్నారు. సేల్స్ లేని వైన్ షాపులకు మాత్రం కేవలం పది నుంచి ఐదులోపే దరఖాస్తులు వచ్చాయి. కాగా నేడు శనివారం మద్యం టెండర్ల దరఖాస్తులకు చివరి రోజు కావడంతో ఉత్కంఠ మొదలైంది.

టెండర్ల రిజర్వేషన్లు ఇలా

జిల్లాలో మూడు ఎక్సైజ్ సర్కిల్ స్టేషన్ల పరిధిలో మొత్తం 48 వైన్స్ షాపులు ఉన్నాయి. సిరిసిల్ల సర్కిల్ పరిధిలో 18, వేములవాడ సర్కిల్ పరిధిలో 16, ఎల్లారెడ్డిపేట సర్కిల్ పరిధిలో 14 వైన్ షాపులు ఉన్నాయి. ఇందులో గౌడ్స్ క్యాటగిరీకి 9 మద్యం షాపులు, ఎస్సీ క్యాటగిరీకి 5 మద్యం షాపులు, జనరల్ 34 మద్యం షాపులు రిజర్వేషన్ల రూపంలో ప్రభుత్వం కల్పించింది.

రెండింతలు తగ్గిన దరఖాస్తులు

మద్యం దుకాణాలను దక్కించుకోవడానికి గత టెండర్లలో చూపించిన ఆసక్తి ప్రస్తుత టెండర్లలో కనిపించడం లేదు. గతంలో కంటే ఒక లక్ష ఫీజు పెరిగిన నేపథ్యంలో టెండర్ వేయడానికి మద్యం వ్యాపారులు ముందుకు రావడం లేదు. 2023 మద్యం పాలసీ సంవత్సరంలో జిల్లాలోని 48 వైన్స్ ల భారీగా 2036 దరఖాస్తులు వచ్చాయి. అందులో 459 మంది మహిళలు కూడా మద్యం టెండర్లలో పాల్గొన్నారు. గత టెండర్లలో ఎక్సైజ్ శాఖ ఖజానాకు జిల్లా నుంచి దాదాపు రూ.41 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే 2026 మద్యం పాలసీ సంవత్సరానికి గత నెల 26 నుంచి అధికారులు దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించారు. మద్యం టెండర్లు వేయడానికి మహిళా వ్యాపారులు సుముఖత చూపడం లేనట్లు తెలుస్తోంది.

దరఖాస్తులకు నేడు చివరి గడువు

బతుకమ్మ, దసరా పండగల నేపథ్యంలో గత 20 రోజులుగా మద్యం టెండర్ల ప్రక్రియ మందకోడిగా కొనసాగుతూ వచ్చింది. చివరి మూడు రోజులుగా దరఖాస్తుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 300 దరఖాస్తులు వచ్చాయి. దీంతో మొత్తం దరఖాస్తుల సంఖ్య 852 కు చేరింది. కాగా ఇప్పటివరకు ఎక్సైజ్ శాఖ ఖజానాకు రూ.25.56 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అయితే చివరి రోజు శనివారం కావడంతో అత్యధిక దరఖాస్తులు వచ్చే అవకాశముందని ఎక్సైజ్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నేటితో వచ్చిన టెండర్ దరఖాస్తులకు ఈనెల 23న డ్రా తీయనున్నారు.

గడువుపెంపు లేదు

శ్రీనివాస్ సిరిసిల్ల ఎక్సైజ్ శాఖ ఇంచార్జీ సీఐ

ఈ సంవత్సరం మద్యం పాలసీ లో భాగంగా మద్యం షాపులకు పిలిచిన దరఖాస్తులకు గడువు పెంపు లేదు. గడువు పెంచుతారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దు. శనివారం చివరి రోజు. మద్యం వ్యాపారస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

Read More..

మద్యం వ్యాపారుల సిండికేట్‌.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

Next Story