మద్యం వ్యాపారుల సిండికేట్‌.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

by Ajay Maddhiboyina |   (  Updated:2025-10-18 02:31:08  IST  )

మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారినట్లు తెలుస్తోంది. ఈ వ్యాపారంలో కింగ్‌మేకర్లుగా ఎదిగిన కొందరు ముఠాగా ఏర్పడి గ్రూపులను ఏర్పాటు చేశారు. ఈ వ్యాపారులే ఆసక్తి ఉన్న వారితో అప్పులిచ్చి పెట్టుబడులు పెట్టిస్తున్నారు. మూడు లక్షల రూపాయల నగదు ఇచ్చి టెండరు వేసేట్టు రహస్య ఒప్పందాలు చేస్తున్నారు.

మద్యం వ్యాపారుల సిండికేట్‌.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
X

దిశ, కరీంనగర్ టౌన్ : మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారినట్లు తెలుస్తోంది. ఈ వ్యాపారంలో కింగ్‌మేకర్లుగా ఎదిగిన కొందరు ముఠాగా ఏర్పడి గ్రూపులను ఏర్పాటు చేశారు. ఈ వ్యాపారులే ఆసక్తి ఉన్న వారితో అప్పులిచ్చి పెట్టుబడులు పెట్టిస్తున్నారు. మూడు లక్షల రూపాయల నగదు ఇచ్చి టెండరు వేసేట్టు రహస్య ఒప్పందాలు చేస్తున్నారు. ఇందుకు పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆసక్తి ఉన్న వారు ఈ గ్రూపుల్లో చేరుతున్నారు. అయితే ఇందుకు పెట్టుబడి వీరిదే, టెండరులో దుకాణం వస్తే వీరు చెప్పిన నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందే. వీరు ఎవరికి దుకాణం ఇవ్వాలన్న వారికి ఇవ్వాల్సిందే. ఒకవేళ దుకాణం రాకపోతే పెట్టుబడి డబ్బులు వాయిదా పద్ధతిలో ఇచ్చేటట్టు ఒప్పందం చేసుకుంటున్నారు.

నేడే ఆఖరు...

రాష్ట్ర ప్రభుత్వం మద్యం టెండరు 2015-17లో భాగంగా జిల్లాలోని మద్యం దుకాణాల కోసం టెండర్ ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. దరఖాస్తుల స్వీకరణ గడువు నేటితో ముగియనుండగా, తక్కువ సంఖ్యలోనే దరఖాస్తులు రావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే నెల 23న దుకాణాల లైసెన్స్ కేటాయించేందుకు డ్రా తీయనున్నారు. డిసెంబర్ 1 నుంచి నూతన లైసెన్సులతో మద్యం దుకాణాలు కొనసాగనున్నాయి.

పాత పద్ధతిలోనే..

గత ప్రభుత్వం మద్యం షాపులకు రిజర్వేషన్లను అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పాత రిజర్వేషన్లతోనే దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. గౌడకు 15శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం షాపులు కేటాయించనున్నారు.

టెండర్ ఫీజు పెంపు..

మద్యం షాపుల టెండర్ ఫీజును రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష పెంచింది. ఇంతకు ముందు రూ. 2 లక్షలు ఉండగా, ప్రస్తుతం రూ.3 లక్షలుగా నిర్ణయించింది. రెండేళ్లకు ప్రభుత్వానికి చెల్లించే పన్నుల వివరాలను వెల్లడించింది.

పోలీసుల నిఘా..

మద్యం దుకాణాల టెండరు ప్రక్రియపై పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వ్యాపారుల అడుగులపై పక్కాగా నిఘా పెడుతున్నారు. గ్రూపులో ఉన్న సభ్యులకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. ఇందులో విదేశీ పర్యటన ఖర్చులు కూడా భరించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వీరి వ్యాపారం చేజారకుండా ఉండేందుకు కూడా వీరు పక్కా. ప్రణాళికలతో అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఎలాంటి ఫిర్యాదులు రాకపోవవడంతో అధికారులు కూడా ప్రేక్షక పాత్ర వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా, సిండికేట్ వ్యాపారుల మాయాజాలం ఇప్పుడు జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ ప్రక్రియతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం గండిపడే అవకాశాలుండటంతో పోలీసులు రంగప్రవేశం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Read More..

ఊపందుకున్న వైన్స్ టెండర్లు.. నేడే లాస్ట్ డేట్

Next Story