​డంపింగ్ యార్డ్ రద్దు చేసే వరకు విశ్రమించను : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

by Ratna Kumari |

"హుజూరాబాద్ ప్రజల ఆరోగ్యం కంటే మాకు ఏదీ ముఖ్యం కాదు.. వివాదాస్పద డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెనక్కి తీసుకునే వరకు ఈ పోరాటం ఆగే ప్రసక్తే లేదు" అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.

​డంపింగ్ యార్డ్ రద్దు చేసే వరకు విశ్రమించను : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
X

దిశ,​ హుజూరాబాద్ రూరల్ : "హుజూరాబాద్ ప్రజల ఆరోగ్యం కంటే మాకు ఏదీ ముఖ్యం కాదు.. వివాదాస్పద డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెనక్కి తీసుకునే వరకు ఈ పోరాటం ఆగే ప్రసక్తే లేదు" అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. పట్టణ శివారులో ప్రతిపాదిత డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ఆర్య వైశ్య వర్తక సంఘం నాయకులు చేపట్టిన నిరసన దీక్షలు ఆదివారం నాటికి 14వ రోజుకు చేరుకున్నాయి. ఈ నిరసన దీక్షా శిబిరం కౌన్సిలర్ గందే శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. అంబేద్కర్ చౌరస్తా వద్ద కొనసాగుతున్న దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఆర్యవైశ్య వర్తక సంఘం నాయకులు దీక్షలో కూర్చోగా.. వారికి మద్దతుగా కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

​ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఐదు ప్రధాన కార్యాచరణలను ప్రకటించారు. ప్రజల పక్షాన పోరాడేందుకు ఈ నెల 7, 8 తేదీలలో తాను స్వయంగా రెండు రోజుల పాటు నిరసన దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇది కేవలం ఒక పార్టీ పోరాటం కాదని, అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. రేపు బీజేపీ చేపట్టబోయే నిరసన కార్యక్రమానికి తాను స్వయంగా హాజరవుతానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ​కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్లతో పాటు కాంగ్రెస్ నేతలను కూడా కలుపుకొని వెళ్తానని, అవసరమైతే ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు. డంపింగ్ యార్డ్ వల్ల కలిగే పర్యావరణ ముప్పు, ఆరోగ్య సమస్యల గురించి వీడియోల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, ప్రభుత్వ మెడలు వంచేలా పక్కా కార్యాచరణ రూపొందించాలని నాయకులను కోరారు.

​"ప్రభుత్వం నుండి అధికారికంగా డంపింగ్ యార్డ్ రద్దు ప్రకటన వచ్చే వరకు విశ్రమించేది లేదని, అప్పటి వరకు నిరసనలు కొనసాగాల్సిందే నాని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య వర్తక సంఘం ప్రతినిధులు, వివిధ పార్టీల ముఖ్య నేతలు పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొని డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే నేరుగా రంగంలోకి దిగడంతో హుజూరాబాద్‌లో ఈ ఉద్యమం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ నిరసన దీక్షలో ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్ గందె శ్రీనివాస్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సుద్దాల హరిశంకర్, అఖిలపక్ష నాయకులు ఈశ్వర్ రెడ్డి, పొల్సని రామారావు, వెంకట్రావు ,ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ ,జైపాల్ రెడ్డి ,కొండాల్ రెడ్డి, గెరెపల్లి శ్రీనివాస్, నూక శ్రీనివాస్, నార్ల రాజేందర్, పుల్లూరు శ్రీకాంత్, ఎర్రం రాజన్న, నార్ల నారాయణ,బల్లు పుణ్ణం శశిధర్, రఘువీర్, చందా చంద్రగుప్త ,గంగిశెట్టి ప్రభాకర్, రేణిగుంట్ల సురేష్, అక్కినపల్లి రమేష్, రామ్ కిషన్ పాల్గొన్నారు.

Next Story