తడిసిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తాం

by Ratna Kumari |

అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు.

తడిసిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తాం
X

దిశ‌, క‌రీంన‌గ‌ర్ క‌లెక్ట‌రేట్ : అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. గురువారం కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు స్వీకరించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అకాల వర్షాల కారణంగా జిల్లాలో తడిసిన సుమారు 600 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఇప్పటివరకు కొనుగోలు చేసి మండలాల వారీగా బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించినట్లు వెల్లడించారు. కరీంనగర్ మండలంలోని పాక్స్ కరీంనగర్ కేంద్రంలో 600 క్వింటాళ్లు, గంగాధర మండలంలోని పాక్స్ గంగాధరలో 1200 క్వింటాళ్లు, లక్ష్మీదేవిపల్లిలో 400 క్వింటాళ్లు, చెర్లపల్లి (ఎన్)లో 400 క్వింటాళ్లు, ర్యాలపల్లిలో 320 క్వింటాళ్లు, కొండయ్యపల్లిలో 200 క్వింటాళ్లు, వెంకటాయిపల్లిలో 160 క్వింటాళ్లు, మంగపేటలో 120 క్వింటాళ్లు, మధురానగర్‌లో 40 క్వింటాళ్లు, నర్సింహులపల్లిలో 240 క్వింటాళ్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు.

అలాగే చొప్పదండి మండలంలోని పాక్స్ చొప్పదండి కేంద్రంలో 800 క్వింటాళ్లు, రామడుగు మండలంలోని తిర్మలాపూర్‌లో 1230 క్వింటాళ్లు, గన్నేరువరం మండలంలో 290 క్వింటాళ్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు జిల్లాలో రెండు లక్షల 67 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ధాన్యాన్ని విక్రయించిన రైతులకు రూ.488.52 కోట్లను ఇప్పటికే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. అదేవిధంగా జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం వేగవంతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మొక్కజొన్న కొనుగోళ్లను మరింత వేగవంతం చేశామని, కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు. ధాన్యం, మొక్కజొన్న నిల్వ, రవాణా, హమాలీ, ఆన్‌లైన్ నమోదు అంశాల్లో ఎటువంటి ఆటంకాలు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గన్ని బ్యాగులు, హమాలీలు, లారీల కొరత లేకుండా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలో గణనీయ స్థాయిలో కొనుగోళ్లు పూర్తయ్యాయని, మిగిలిన ప్రక్రియను కూడా నిర్దేశిత గడువులో పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు. మండల స్థాయి అధికారులు నిరంతరం కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తూ రైతులకు తక్షణ సహాయం అందిస్తున్నారని తెలిపారు. రైతులు తమ పంటను నిర్భయంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం రైతులకు పూర్తి సహకారం అందిస్తుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. 115 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావడంతో మూసి వేశామని పేర్కొన్నారు. మిగిలిన కేంద్రాల్లోనూ కొనుగోలు మరింత వేగవంతం చేసి త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.

Next Story