ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తాం

by Nallavelli.Anjaneyulu |

కరీంనగర్ జిల్లాలో ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామని కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు.

ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తాం
X

దిశ కరీంనగర్ కలెక్టరేట్ : కరీంనగర్ జిల్లాలో ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామని కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో మూడు నెలలకోసారి జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాను కలెక్టర్ పర్యవేక్షించారు. జాబ్ మేళా నిర్వహణ తీరుపై అధికారులను వివరాల లను తెలుసుకున్నారు. ఎంత మంది యువతీ యువకులు వచ్చారు. ఏ కంపెనీ అవకాశం కల్పించారు అని ఆరా తీశారు. వసతుల కల్పన పై వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు అందరూ సమన్వయంతో జాబ్ మేళాను విజయవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. రాబోయే రోజుల్లోనూ ఇదే స్ఫూర్తితో మరిన్ని జాబ్ మేళాలను ఏర్పాటు చేద్దామని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో ఉద్యోగులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వారి ఆర్థిక అభ్యున్నతికి తోడ్పడుతామని తెలిపారు.

జాబ్ మేళాకు అనూహ్య స్పంద‌న

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో కలెక్టర్ చిత్రా మిశ్రా ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించింది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కలెక్టర్ నేతృత్వంలో వివిధ శాఖల అధికారుల సమన్వయంతో జాబ్ మేళాను అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. హాజరైన అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కూలర్లు, తాగునీటి వసతి కల్పించగా.. టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేపట్టి అభ్యర్థులకు ఉపశమనం కల్పించారు. ఈ జాబ్ మేళాలో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కంపెనీలతో పాటు కరీంనగర్‌కు చెందిన స్థానిక కంపెనీలు కూడా పాల్గొన్నాయి. ఐటీ, నాన్‌-ఐటీ, హెల్త్‌కేర్, ఆర్గానిక్, డైరీ, అగ్రికల్చర్ తదితర రంగాలకు చెందిన సుమారు 90 కంపెనీలు నియామక ప్రక్రియను నిర్వహించాయి. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి దాదాపు 3,000 మంది యువతీ యువకులు హాజరుకాగా, వారిలో 997 మంది వివిధ ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికయ్యారు. మరో 478 మందిని వివిధ కంపెనీలు తక్షణమే ఉద్యోగాలకు ఎంపిక చేయగా, త్వరలో వారికి నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కే. మహేశ్వర్, జిల్లా ఉపాధి కల్పన అధికారి తిరుపతిరావు, డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్, పరిశ్రమల శాఖ జీఎం సాల్మన్ రాజు, పీడీ మెప్మా స్వరూపరాణి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి పాల్గొన్నారు.

Next Story