- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్మో డేంజర్ స్పాట్.. ప్రాణాలను బలిగొంటున్న మూలమలుపు!
కోరుట్ల–వేములవాడ ప్రధాన రహదారిపై పోసానిపేట గ్రామ శివారులోని అత్యంత ప్రమాదకరమైన మూలమలుపు రోడ్డు ప్రమాదాలకు కేంద్రంగా మారింది.

దిశ, కథలపూర్: కోరుట్ల–వేములవాడ ప్రధాన రహదారిపై పోసానిపేట గ్రామ శివారులోని అత్యంత ప్రమాదకరమైన మూలమలుపు రోడ్డు ప్రమాదాలకు కేంద్రంగా మారింది. తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న కనీసం పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రమాదాల నివారణకు అవసరమైన స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు వంటి కనీస భద్రతా చర్యలను కూడా ఆర్ అండ్ బి అధికారులు చేపట్టకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ డేంజర్ బ్లాక్ స్పాట్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
చెట్టును ఢీకొట్టిన ఎమ్మార్వో కారు..
వేములవాడ నుంచి డ్యూటీకి వెళ్తున్న కథలాపూర్ ఎమ్మార్వో రమేష్ గౌడ్ కారు శనివారం ఉదయం 11 గంటల సమయంలో పోసానిపేట మూలమలుపు వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మార్వో రమేష్ గౌడ్ చేయి విరగగా మెరుగైన చికిత్స కోసం కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఎమ్మార్వో ఒక్కరే ఉండడం కార్ లో ఉన్న ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవడంతో ఎమ్మార్వో రమేష్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
రెండేళ్లలో ఆరుగురు మృతి..
రోడ్డు వెంట నిత్యం ఒకే చోట ప్రమాదాలు జరిగే స్థలాలను ఆర్ అండ్ బి అధికారులతో పాటు పోలీస్ శాఖ బ్లాక్ స్పాట్లుగా గుర్తిస్తుంది. అలాంటి బ్లాక్ స్పాట్లు ఉన్నచోట ప్రమాదాలను నివారించేందుకు ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో ముందు జాగ్రత్త చర్యలను చేపట్టాల్సి ఉంటుంది. వేములవాడ నుండి కోరుట్ల వెళ్లే ప్రధాన రహదారి కావడం తో నిత్యం అనేకమంది ఈ రోడ్డు గుండా రాకపోకలు సాగిస్తున్నారు. కాగా పోసానిపేట శివారులోని డేంజర్ టర్నింగ్ పాయింట్ వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో రెండేళ్ల వ్యవధిలో జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న కూడా సంబంధిత శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం విస్మయం కలిగిస్తోంది.
పోసానిపేట గ్రామానికి చెందిన ఎం. డి. షాదీక్ దుబాయ్‌లో 7 సంవత్సరాలపాటు ఉపాధి నిమిత్తం వెళ్ళి తిరిగి గత ఏడాది జులై నెలలో ఇండియాకు వచ్చాడు. అయితే అతనికి అదే ఏడాది ఆగస్టు నెలలో పెళ్ళి నిశ్చయం కాగా బయటకు పని నిమిత్తం వచ్చి అదే మూల మలుపు ప్రాంతంలో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. దుంపేట గ్రామానికి చెందిన తోట లింగం(60) అనే వృద్ధుడు గత ఏడాది అక్టోబర్ నెలలో తాండ్రియాలలో పని పూర్తి చేసుకుని అదే మూల మలుపులో ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొనడంతో అక్కడికక్కడే స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయాడు. గత ఏడాది నవంబర్ నెలలో పోసానిపేట గ్రామానికి చెందిన జవిడి రఘుపతి రెడ్డి అదే స్పాట్ లో ఎదురుగా కోరుట్ల వైపు నుంచి వస్తున్న లారీ ఢీ కొనడంతో తల భాగం చిట్లి పోయి మెదడు బయటపడి ప్రాణాలు విడిచాడు.
2024 సంవత్సరంలో జరిగిన సంఘటనలో రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలానికి చెందిన శివ దీక్షలో ఉన్న ఓ వ్యక్తి హెల్మెట్ ధరించి ఉన్న కూడా ఇదే చోట ఆక్సిడెంట్ కావడం తో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. అలాగే రెండేండ్ల క్రితం జరిగిన ప్రమాదంలో కోరుట్ల పట్టణానికి చెందిన ఓ వృద్ధుడు మేడిపల్లి మండలం రాజలింగంపేట గ్రామంలోని తన అల్లుడు ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో పోసానిపేట గ్రామ ఎల్లమ్మ ప్రాంతంలో జరిగిన ఆక్సిడెంట్ లో స్పాట్లోనే మృత్యువాత పడ్డాడు. ఇదే స్పాట్లో మరి కొంతమంది వ్యక్తులు ఆక్సిడెంట్ కారణంగా కాళ్ళు, చేతులు విరగొట్టుకున్న సంఘటనలు కూడా చాలానే జరిగాయి.
రోడ్డు సేఫ్టీ కోసం అంచనాలు పంపాము: ఆర్ అండ్ బి ఏఈఈ లక్ష్మీకాంత్
ఇప్పటికే రోడ్డుకు సంబంధించిన సేఫ్టీ నిమిత్తం అంచనాలను పై అధికారులకు పంపాము. అయితే కోరుట్ల -వేములవాడ ప్రధాన రోడ్డు విస్తరణ పనులకు అనుమతులు మంజూరు అయ్యాయి. అందువల్ల సేఫ్టీ పనులు వాయిదా పడ్డాయి. త్వరలోనే సేఫ్టీకి సంబంధించిన చర్యలు చేపడతామని తెలిపారు.
మహమ్మద్ అజారుద్దీన్: పోసానిపేట గ్రామస్తుడు
ఈ ప్రాంతంలో వరుసగా జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో ఆర్ అండ్ బి అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలి.






