మున్సిపల్ ఉద్యోగులు నిర‌స‌న

by Ratna Kumari |

మున్సిప‌ల్ ఉద్యోగుల‌పై సోమ‌వారం చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌లో జ‌రిగిన అసాంఘిక చ‌ర్య‌ను నిర‌సిస్తూ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మున్సిప‌ల్ కార్యాల‌యంలో భోజ‌న విరామ స‌మ‌యంలో న‌ల్ల బ్యాడ్జీలు ధ‌రించి నిర‌స‌న తెలిపారు.

మున్సిపల్ ఉద్యోగులు నిర‌స‌న
X
దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : మున్సిప‌ల్ ఉద్యోగుల‌పై సోమ‌వారం చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌లో జ‌రిగిన అసాంఘిక చ‌ర్య‌ను నిర‌సిస్తూ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మున్సిప‌ల్ కార్యాల‌యంలో భోజ‌న విరామ స‌మ‌యంలో న‌ల్ల బ్యాడ్జీలు ధ‌రించి నిర‌స‌న తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు దారం శ్రీనివాస్ రెడ్డి, మడిపెల్లి కాళీ చరణ్ మాట్లాడుతూ మాజీ కార్పొరేటర్ గుగ్గిళ్ల‌ రమేష్ విధుల్లో ఉన్న మున్సిపల్ ఉద్యోగులపై దుర్భాషలాడుతూ, అసభ్య పదజాలంతో అవమానకరంగా ప్రవర్తించడం తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు. మున్సిపల్ ఉద్యోగులు ఎల్లప్పుడూ ప్రభుత్వ ఆదేశాలు, చట్టాలు, నియమావళి మేరకు తమ విధులను నిర్వర్తిస్తారని, ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ఎటువంటి చర్యలను చేపట్టరని వారు స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టి తమ అభీష్టం మేరకు వ్యవహరించాలంటూ ఉద్యోగులపై ఒత్తిడి తేవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో అనుచితమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ కార్పొరేటర్ గుగ్గిళ్ల‌ రమేష్ మున్సిపల్ ఉద్యోగులకు బహిరంగంగా, బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఉద్యోగుల జేఏసీ త‌ర‌పున‌ డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

లేనిపక్షంలో రాబోయే రోజుల్లో ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వ‌స్తుంద‌ని హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో అసిస్టెంట్ కమిషనర్ సువార్త కి జేఏసీ నాయకులు వినతిపత్రం సమర్పించారు . అనంతరం మేయర్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. మేయ‌ర్ సానుకూలంగా స్పందించి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామి ఇచ్చిన‌ట్టు తెలిపారు. క‌మిష‌న‌ర్ ఈ వ్య‌వ‌హారాన్ని అత్యంత కీల‌క‌మైన విష‌యంగా ప‌రిగ‌ణించి.. గుగ్గిళ్ల ర‌మేష్ ని పిలిపించి మున్సిప‌ల్ ఉద్యోగుల‌కు బే ష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పించాల‌ని, ఉద్యోగుల‌కు ర‌క్ష‌ణ‌, భ‌రోసా క‌ల్పించాల‌ని ఉద్యోగుల జేఏసీ నాయ‌కులు కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, గెస్ట్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు, ఎంప్లాయిస్ జేఏసీ కన్వీనర్ మడిపల్లి కాళీ చరణ్, కార్యదర్శి డాక్టర్ అరవింద్ రెడ్డి, కేంద్ర సంఘం నాయకులు సర్దార్ హర్మేందర్ సింగ్, పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్, భరద్వాజ్ కార్యదర్శి వెలిచాల సుమంతరావు, రూరల్ అధ్యక్షుడు కోడూరి వాస్తవి గౌడ్ , కార్యదర్శి కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి, నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కోట రామస్వామి, కార్యదర్శి శంకర్, మున్సిపల్ ఉద్యోగులు సునీల్ శ్యామ్, నరసయ్య, నాయకులు అభినయ్ రెడ్డి, రామ్మోహన్, లవ కుమార్, కరుణాకర్, రాజేష్, ఉద్యోగులు నాయకులు పాల్గొన్నారు.
Next Story