జగిత్యాలలో నిషేధిత ఈ-సిగరెట్ల కలకలం..!

by velandi.Saikiran |

జగిత్యాల పట్టణంలో నిషేధిత ఎలక్ట్రానిక్ సిగరెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది.

జగిత్యాలలో నిషేధిత ఈ-సిగరెట్ల కలకలం..!
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల పట్టణంలో నిషేధిత ఎలక్ట్రానిక్ సిగరెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. టవర్ సర్కిల్ పరిధిలోని ఓ జనరల్ స్టోర్‌పై శుక్రవారం సీసీఎస్ పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించినట్లు తెలుస్తుంది. ఈ దాడుల్లో ఎలక్ట్రానిక్ సిగరెట్లతో పాటు ఇతరత్రా నిషేధిత పొగాకు ఉత్పత్తుల వినియోగానికి సంబంధించినట్లు భావిస్తున్న కొన్ని సిలికాన్ పేపర్లు(రాపర్), వేపర్లు ఇతర వస్తువులు కూడా లభించినట్లు విశ్వసనీయ సమాచారం. భారత ప్రభుత్వం 2019లో ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం అమల్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

ఈ చట్టం ప్రకారం ఈ-సిగరెట్ల తయారీ, దిగుమతి, విక్రయం, పంపిణీ, నిల్వ వంటి కార్యకలాపాలు పూర్తిగా నిషేధం. ఈ నేపథ్యంలో జగిత్యాలలో ఇటువంటి ఉత్పత్తులు లభించడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఇలాంటి కొన్ని ఎలక్ట్రానిక్ సిగరెట్లపై "0 నికోటిన్" అని ముద్రించి ఉన్నప్పటికీ, వాటిలో నికోటిన్ లేదా ఇతర హానికర రసాయనాలు ఉండే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు గతంలో హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న వాటి పరిమాణం ఎంత? ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? అనే అంశాలపై పోలీసుల అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Next Story