- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమతులు అన్నీ ఉన్నా.. కొనొచ్చా లేదా అనే సందేహం.. ఎందుకు?
చెరువులను, కుంటలను.. అన్ని జల వనరులను పరిరక్షించాలి. అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. అలాగే తెలంగాణలో అభివృద్ధి కొనసాగాలి. మిగతా మెట్రో నగరాలతో పోటీ పడేంతగా మౌళిక సదుపాయాల కల్పన బాధ్యత ప్రభుత్వానిదే.

దిశ, తెలంగాణ బ్యూరో: చెరువులను, కుంటలను.. అన్ని జల వనరులను పరిరక్షించాలి. అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. అలాగే తెలంగాణలో అభివృద్ధి కొనసాగాలి. మిగతా మెట్రో నగరాలతో పోటీ పడేంతగా మౌళిక సదుపాయాల కల్పన బాధ్యత ప్రభుత్వానిదే. పర్యావరణాన్ని కూడా కాపాడాలి. అక్రమార్కులను వదిలి పెట్టొద్దు. భేషజాలు లేకుండా అందరి పైనా చర్యలు తీసుకోవాల్సిందే. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లల్లో నిర్మాణాలు చేపడితే కూల్చేయాల్సిందే. అదే హైడ్రా చేస్తున్న డ్యూటీ. అందరూ అభినందించాల్సిందే. ఐతే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతులు, రెరా నంబరు వచ్చిన ప్రాజెక్టులను కూడా కూల్చేస్తే చట్టాల మీద అనుమానం కలుగుతుంది. అన్ని పత్రాలు చూసి, క్షేత్ర స్థాయిలో అధికారుల పరిశీలన తర్వాతే కదా అనుమతులు జారీ చేసేది! మరి అన్ని రకాల అనుమతులు కలిగిన ప్రాజెక్టుల జోలికి హైడ్రా వెళ్తుండడంతో డెవలపర్లు, కొనుగోలుదార్లల్లో అనుమానాలు కలుగుతున్నాయి. ఇంతకీ ఏం చూసి కొనాలి? ఏయే పత్రాలు పరిశీలించాలి? హైడ్రా ఎన్వోసీ కూడా చూడాలా? బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయని ఫ్లాట్లు కొనుగోలు చేసిన తర్వాత కూల్చేస్తే తమ గతి ఏం కావాలి? బ్యాంకు అధికారులు కూడా లీగల్‌గా టైటిల్ వెరిఫికేషన్, అన్ని రకాల అనుమతులు చూసిన తర్వాతే లోన్ మంజూరు చేస్తారు. మరి అలాంటి ప్రాజెక్టులపైనా లీగల్, ఇల్లీగల్ అన్న డౌట్ కలుగుతుంటే కొనడానికి ఎవరు ముందుకు వస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అధికారులపై యాక్షన్ ఏది?
హైడ్రా కూల్చివేసిన కొన్నింటికి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతులు ఉన్నాయి. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోనూ లంచాలు తీసుకొని పర్మిషన్లు ఇచ్చారనుకుందాం. ఆ అనుమతులు చూసి సామాన్యులు కొనుగోలు చేశారు. మరి ఇప్పుడు తప్పు ఎవరిది? అనుమతులు చూసి కొన్న వారిదేనా? వారే నష్టపోవాలా? అనుమతులు జారీ చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులపై ఇప్పటి వరకు ఒక్కరిపైనా చర్యలు ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలాగే ఎన్వోసీలు జారీ చేసిన ఇరిగేషన్ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? నాలాలను దారి మళ్లించడం, అసలు క్యాచ్మెంట్ ఏరియాను తగ్గించి చూపడం, చెరువుల విస్తీర్ణాన్నే మార్చేసిన ఉదంతాలు ఉన్నాయి. అలాంటి అవినీతి అధికారుల వల్లనే చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయి. ఒకవేళ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తుంటే చూస్తూ ఎలాంటి చర్యలు తీసుకోని రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, నీటి పారుదల శాఖ అధికారుల బాధ్యత లేదా? ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు కూడా ఉన్నారు.
అనుమతుల ఆధారంగానే రుణాలు
జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ వంటి స్థానిక సంస్థలిచ్చే అనుమతుల ఆధారంగానే ఏ ప్రాజెక్టుకైనా బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. అనుమతులన్నీ సక్రమంగా ఉన్నప్పుడే కొనుగోలుదారులు అందులో ఫ్లాట్లను కొనుగోలు చేస్తారు. అయితే నిర్మాణమంతా పూర్తయ్యాక, ఓసీ దశలో ఎఫ్‌టీఎల్, నాలాకు సంబంధించిన అభ్యంతరాలను లేవనెత్తడం అనేది చాలా సున్నితమైన అంశంగా చూడాలి. ఇది కేవలం డెవలపర్లకు సంబంధించిన అంశం కాదు. ప్రాజెక్టు కోసం నిధులు ఇచ్చిన బ్యాంకులు కూడా భాగస్వాములే. అలాగే ఇంటి కొనుగోలుదారులకు గృహ రుణాల్ని మంజూరు చేసిన బ్యాంకులు, ఉద్యోగులు కూడా భాగస్వామ్యులైనట్లే కదా. ప్రాజెక్టుపైన కొన్ని వందలాది మంది కార్మికులు ఆధారపడి పని చేస్తారు. నిర్మాణ నిపుణులూ తమ సేవల్ని అందిస్తారు. అన్నింటికీ మించి డబ్బులు పొదుపు చేసి, బ్యాంకు నుంచి రుణం పొందిన తర్వాత ఫ్లాట్ కొనుగోలు చేసిన సామాన్యుడు బాధితుడిగా మిగిలిపోతున్నాడు. స్థానిక సంస్థలు అనుమతులిచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడం అంటే.. ముందు అవినీతి చోటు చేసుకుందని, సరైన పరిశీలన చేయలేదని, విధుల్లో నిర్లక్ష్యం వహించారనే అర్థం. అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగానే ప్రాథమిక స్థాయిలో చేయాల్సిన అభ్యంతరాలను ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేసే దశలో చేయడం సరైన విధానం కాదు. ఇలా చేయడం వల్ల డెవలపర్ ఒక్కరికే ఇబ్బంది కాదు. బ్యాంకులు, అధికారులు, కొనుగోలుదారులు కూడా భాగస్వాములే.
ఓసీ వచ్చాక కొనాలా?
సాధారణంగా ఇంటి కొనుగోలుదారులు ఇల్లు కొనే ముందు జీహెచ్ఎంసీ లేదా హెచ్ఎండీఏ, రెరా అనుమతిని చూస్తారు. అవి ఉన్నాయన్న భరోసాతో ఇల్లు కొనుగోలు చేస్తారు. సొంతింటి కలను సాకారం చేసుకునే తరుణంలో ఎఫ్‌టీఎల్ మ్యాపులు, పాత చెరువుల రికార్డులు, నాలా అలైన్‌మెంట్, బఫర్ జోన్ టెక్నికల్ వివరాలు వంటివి తెలుసుకునే అవకాశం రాదు. ఇవన్నీ అధికారులు చూసిన తర్వాతే అనుమతులు ఇస్తారన్న నమ్మకం ఉంటుంది. అధికారులే అవినీతిపరులని, ఎఫ్టీఎల్ పరిధిలో అనుమతులు జారీ చేస్తారని కొనుగోలుదార్లకు ఎలాంటి డౌట్ రాదు. అందుకే ఇలాంటి అంశాల్ని ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేసే దశలో కాకుండా అనుమతినిచ్చే సమయంలోనే పరిశీలించాలి. ఇందుకోసం ఒక బలమైన అనుసంధాన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. స్థానిక సంస్థలతో పాటు నీటి పారుదల, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, రెరా వంటి విభాగాల మధ్య డిజిటల్ వెరిఫికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడాలి. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన లేదా నిర్మాణ పనులు చివరి దశలో ఉన్న ప్రాజెక్టుల విషయంలో చట్టబద్ధమైన అనుమతులను విశ్వసించి పెట్టుబడులు పెట్టిన గృహ కొనుగోలుదారులు, రుణాలు మంజూరు చేసిన బ్యాంకులు నష్టపోయే ప్రమాదం ఉంది.
నమ్మకం పెంచండి
ఎక్కడైనా వాస్తవమైన సాంకేతిక లోపాలు ఉన్నట్లు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేసే దశలో గుర్తిస్తే వాటిని కేవలం నిర్మాణాల నిలిపివేత, కూల్చివేత కోణంలోనే కాకుండా నిపుణుల కమిటీ ద్వారా సమగ్రంగా పరిశీలించాలి. అవసరమైతే సాంకేతిక సవరణలు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, చెరువుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు, బఫర్ జోన్ బలోపేతం, పర్యావరణ పరిరక్షణకు డెవలపర్ల భాగస్వామ్యం వంటి ఆచరణాత్మక ప్రత్యామ్నాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రజా ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ, గృహ కొనుగోలుదారుల హక్కులు.. మూడింటి మధ్య సమతుల్యత సాధించే విధానమే ఉత్తమ పరిష్కారమని చెప్పొచ్చు. ఇలా చేస్తేనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎకో సిస్టమ్‌పై ప్రజల నమ్మకాన్ని కాపాడాలి. పర్యావరణాన్ని పరరక్షించాల్సిందే. కానీ ప్రభుత్వ అనుమతులపై నమ్మకం కోల్పోవద్దు. కష్టార్జితంతో ఇల్లు కొనుగోలు చేసిన అమాయక కస్టమర్లు, ఫండింగ్ చేసిన బ్యాంకులు, నిర్మాణం పూర్తి చేసిన డెవలపర్లను కూడా రక్షించాలి.






