ప్లాట్‌ కొంటే.. పాట్లు తప్పవు

by Sujitha Rachapalli |

కందుకూరు ప్రాంతంలో రియల్టర్‌ ఒకరు వివిధ పేర్లతో ఐదు భారీ వెంచర్లు చేశారు. వాటిపై ఫిర్యాదులు వెళ్లాయి. విచారణ జరిపిన అధికారులు ఒక వెంచర్‌‌ను నిబంధన ప్రకారం చేయలేదని తేల్చారు.

ప్లాట్‌ కొంటే.. పాట్లు తప్పవు
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : కందుకూరు ప్రాంతంలో రియల్టర్‌ ఒకరు వివిధ పేర్లతో ఐదు భారీ వెంచర్లు చేశారు. వాటిపై ఫిర్యాదులు వెళ్లాయి. విచారణ జరిపిన అధికారులు ఒక వెంచర్‌‌ను నిబంధన ప్రకారం చేయలేదని తేల్చారు. ఫ్యూచర్‌ సిటీకి చేరువలోనే అంటూ కడ్తాల్‌ ప్రాంతంలో రియల్టర్‌ చేసిన ఓ వెంచర్‌‌కు అనుమతులు లేవని తెలిసి అధికారులు ఫ్లెక్సీ బోర్డులు, జెండాలను తొలగించారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. భావి నగరం ఫ్యూచర్‌ సిటీ చుట్టూ వెలసిన చాలావరకు వెంచర్లది ఇదే పరిస్థితి.

తిప్పలు తప్పవు

‘చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవడం’ అంటే ఇదేనేమో. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో రూపుదిద్దుకుంటున్న ‘భారత్‌ ఫ్యూచర్‌ సిటీ’ని చూపించి కొంతమంది రియల్టర్లు నయా మోసానికి తెరతీస్తున్నారు. స్థిరాస్తి వ్యాపారం విస్తరిస్తున్న ఈ ప్రాంతంలో కొత్తగా అనేక రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు వెలుస్తున్నాయి. ఇదే క్రమంలో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. లే అవుట్‌‌కు దరఖాస్తు పెట్టి పూర్తి స్థాయి అనుమతులు రాకముందే ప్లాట్లను విక్రయిస్తున్నారు. కొందరైతే లే అవుట్‌ అనుమతులు తీసుకుని రెరాలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోకుండానే విక్రయాలు జరుపుతున్నారు. అందమైన బ్రోచర్లతో ఆన్‌లైన్‌‌లోనే వ్యాపారం చేస్తున్నారు. అయితే ఇలా గుడ్డిగా ప్లాట్లను కొనుగోలు చేసిన వారికి పాట్లు తప్పవని స్థిరాస్తి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.’

తక్కువకేనని ఆశపడితే..

ఫ్యూచర్‌ సిటీ నలు వైపుల అభివృద్ది చెందేలా ప్రభుత్వం చేపట్టిన చర్యలు రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఊతంగా మారాయి. ఓఆర్‌ఆర్‌ నుంచి ఫ్యూచర్‌ సిటీ వరకు గ్రీన్‌ ఫీల్డ్‌​‍ రహదారి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఇటీవల పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ కార్యాలయ భవనం కార్యకలాపాలు అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంతంలో అభివృద్ది చర్యలు ఊపందుకోనున్నాయి. కాలుష్య రహిత పరిశ్రమలు, ఎడ్యుకేషన్‌ హబ్‌, వినోద కేంద్రాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఇప్పటికే చుట్టు పక్కల ప్రాంతాలకు ఇంటర్నేషనల్​‍ స్కూల్స్‌‍ వచ్చాయి. భవిష్యత్‌ అవసరాల కోసం ఫ్యూచర్‌ సిటీ వైపు ప్లాట్లు కొనడం బెటర్‌ అని డెవలపర్లు చెబుతున్నారు. నగరంలో ఇళ్లు, స్థలాలు కొనాలనుకునే వారికి తమ బడ్జెట్‌‌లో అందుబాటులో లేకపోవడంతో సరసమైన ధరలకే ప్లాట్లను కొనుగోలు చేయవచ్చనే భావనతో చాలా మంది ఫ్యూచర్‌ సిటీ వైపుగా చూస్తున్నారు. ఇక్కడ మౌలిక వసతులకు సంబంధించిన ప్రాజెక్టులు పూర్తయ్యేసరికి ఈ ప్రాంత రూపు రేఖలు మారిపోయి తద్వారా అప్పటికే కొన్న స్థిరాస్తుల విలువలు పెరిగి లాభపడతామని చాలా మంది భావిస్తున్నారు. ప్రజల ఆసక్తిని గమనించి మహేశ్వరం, కందుకూరు, కడ్తాల్‌, ఆమన్‌ గల్‌, యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, మాడ్గుల తదితర ప్రాంతాల్లో భారీ లే అవుట్లు, విల్లా ప్రాజెక్టులను డెవలపర్స్‌​‍ చేపడుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా.. నాలా కన్వెన్షన్‌ చేయకుండానే గుంటల లెక్కన అమ్మి కొంతమంది రియల్టర్లు కస్టమర్లను బురిడీ కొట్టిస్తున్నారు. తక్కువ ధరకే అమ్ముతున్నారని కొంటే నిర్మాణ అనుమతులు రాక భవిష్యత్తులో ఇబ్బందులు పడక తప్పదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అక్రమ వెంచర్లపై ఓ కన్నేసి ఉంచి ఆదిలోనే అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు

*హెచ్‌ఎండీఏ లేదా స్థానిక టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల ఆమోదంతో పొందిన లే అవుట్‌ పత్రాలను పరిశీలించాలి.

*వ్యవసాయేతర భూమి మార్పిడి(నాలా) పత్రాలను తనిఖీ చేయాలి.

*తెలంగాణ ప్రభుత్వ రెరా వెబ్‌ సైట్‌ ద్వారా ప్రాజెక్టుకు రిజిస్ట్రేషన్‌ ఉందో, లేదో తెలుసుకోవాలి.

*30 సంవత్సరాల టైటిల్‌ డీడ్స్​‌, ఈసీ క్లియర్‌గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి.

*లే అవుట్‌‌లో రోడ్లు, కాలువలు, నీటి సౌకర్యం తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించాలి

*బ్యాంకింగ్‌ ద్వారానే డబ్బులు చెల్లించి రశీదు తీసుకోవడం ఉత్తమం.

Next Story