ఈ20 నష్టాలపై న్యాయపోరాటం.. కోర్టుకు వెళ్తామంటున్న 45 శాతం వాహనదారులు

by I. Sairam |

ఈ20 పెట్రోల్ వల్ల వాహనాలకు నష్టం వాటిల్లితే న్యాయపోరాటం ద్వారా పరిహారం పొందుతామని 45 శాతం వాహనదారులు అనుకుంటున్నారు.

ఈ20 నష్టాలపై న్యాయపోరాటం.. కోర్టుకు వెళ్తామంటున్న 45 శాతం వాహనదారులు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఈ20 పెట్రోల్ వల్ల వాహనాలకు భారీ నష్టం వాటిల్లితే న్యాయపోరాటం ద్వారా పరిహారం కోరేందుకు మెజారిటీ పెట్రోల్ వాహనదారులు సిద్ధంగా ఉన్నారు. అందులో దాదాపు సగం మంది వినియోగదారుల కోర్టులను ఆశ్రయించడానికి, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ విషయాన్ని లోకల్ సర్కిల్స్ కొత్త సర్వే శుక్రవారం వెల్లడించింది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ కన్స్యూమర్ కోర్టు ఇచ్చిన ఒక సంచలన తీర్పు తర్వాత వాహనదారుల్లో ఈ చైతన్యం పెరిగింది.

న్యాయ పోరాటానికి సిద్ధం..

లోకల్ సర్కిల్స్ 316 జిల్లాల్లోని 22,000 కంటే ఎక్కువ మంది పెట్రోల్ వాహనదారుల నుండి అభిప్రాయాలు సేకరించింది. ఈ20 పెట్రోల్ వల్ల వాహనానికి భారీ నష్టం జరిగితే నష్టపరిహారం రికవరీ చేయడానికి ఏం చేస్తారని సర్వే ప్రశ్నించింది. అయితే 31 శాతం మంది వినియోగదారుల కమిషన్ (కన్స్యూమర్ కోర్టు)ను ఆశ్రయిస్తామని చెప్పారు. అందుబాటులో ఉన్న ప్రతి చట్టపరమైన అవకాశాన్ని ఉపయోగించుకుంటామని 14 శాతం మంది తెలిపారు. మొత్తంగా 45 శాతం మంది న్యాయ పోరాటాన్ని ఎంచుకునేందుకు సిద్దంగా ఉన్నామని వెల్లడించారు. కాగా.. 18 శాతం మంది వాహనం తయారు చేసిన కంపెనీ, ఇంధన సంస్థ రెండింటి నుండి పరిహారం కోరతామని చెప్పారు. 9 శాతం మంది కంపెనీ నుంచి మాత్రమే పరిహారం కోరతామని పేర్కొన్నారు. అయితే 14 శాతం మంది తాము కోర్టుల చుట్టూ తిరగబోమని, మరో 14 శాతం మంది ఇంకా తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

2023 కంటే ముందు వాహనాల్లో రిపేర్లు.. ?

భారత్‌లో ఈ20 పెట్రోల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పాత వాహనాల యజమానులలో ఆందోళన పెరిగిందని ఈ సర్వే ప్రముఖంగా చెప్పింది. 2025 ప్రారంభం నుంచి తమ వాహనాల రిపేర్లు అసాధారణంగా పెరిగాయని 2023 కంటే ముందు తయారైన పెట్రోల్ వాహనాల యజమానులలో 55 శాతం మంది తెలిపారు. అలాగే 66 శాతం మంది తమ వాహనాల మైలేజ్ 10 శాతం కంటే తగ్గినట్టు గత సర్వేలో తేలిందని లోకల్ సర్కిల్స్ వెల్లడించింది. ఈ తాజా సర్వే ఫలితాల ఆధారంగా దేశంలో ఇథనాల్ బ్లెండింగ్ అంశాన్ని పునఃసమీక్షించాలని ప్రభుత్వాన్ని కోరింది. కాలుష్యం తగ్గించేందుకు ప్రయత్నిస్తూనే, వాహనాల మన్నికకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ20తో పాటు ఈ0, ఈ5, ఈ10 వంటి పెట్రోల్‌ను కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని సిఫార్సు చేసింది.

కన్స్యూమర్ కోర్టు సంచలన తీర్పు.. హైకోర్టుకు సుజుకీ..

ఈ20 పెట్రోల్ వాడకం వల్ల తన కొత్త ‘మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా’ కారు ఇంజన్‌లో సమస్యలు వచ్చాయని, పని తీరు, మైలేజ్ తగ్గిందని, వాహనం ఆగిపోతోందని ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన ఓ వ్యక్తి రాయ్‌పూర్ జిల్లా కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు జూలై 14న ఆ కారు యజమానికి అనుకూలంగా సంచలన తీర్పును ఇచ్చింది. ఆయనకు కొత్త కారు ఇవ్వాలని, లేదా ఆ కారు ధర, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని కలిపి సుమారు రూ. 20.5 లక్షలు ఇవ్వడంతో పాటు అతడి మానసిక వేదనకు పరిహారంగా రూ. 1 లక్ష చెల్లించాలని మారుతీ సుజుకి కంపెనీని, ఆ కారు అమ్మిన డీలర్‌ను ఆదేశించింది. అయితే ఈ తీర్పుపై మారుతీ సుజుకి కంపెనీ హైకోర్టుకు వెళ్లాలని భావిస్తోంది. తమ వాహనం ఈ20కి అనుకూలమైనదే అని, కేవలం పెట్రోల్‌లో కల్తీ వల్లే ఇలా జరిగిందని చెబుతోంది.

Next Story