- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జోర్డాన్‌లోని యూఎస్ విమానాలపై దాడులు.. అమెరికా దాడులకు ప్రతీకారంగా చర్య : ఇరాన్
అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతత నెలకొంది. తాజాగా జోర్డాన్‌లోని యూఎస్ విమానాలపై ఐఆర్జీసీ దాడి చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో : జోర్డాన్‌లో ఉన్న పలు అమెరికా సైనిక విమానాలపై ఇరాన్ దాడులు చేసింది. ఫైటర్ జెట్లపై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్టుగా ఇరాన్ యొక్క రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ) శుక్రవారం ప్రకటించింది. తమ దేశంలోని పలు ప్రాంతాలపై అమెరికా రాత్రి సమయంలో జరిపిన దాడుల్లో కనీసం 8 మంది మృతి చెందారని, దానికి ప్రతీకారంగా ఈ చర్యకు దిగినట్టు వెల్లడించింది. ఈ దాడుల్లో అమెరికాకు చెందిన పలురీఫ్యూయలింగ్ (ఇంధనం నింపే) విమానాలను, ఫైటర్ జెట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, మరికొన్ని విమానాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపింది. అయితే తమ పవిత్ర భూమిని అమెరికా శక్తులు ఇస్లాం వ్యతిరేక చర్యలకు వాడుకోనివ్వకూడదని, ఆ దేశస్తులను వెళ్లగొట్టాలని జోర్డాన్ వాసులకు ఇరాన్ పిలుపునిచ్చింది. కాగా.. ఇరాన్ ప్రకటనకు భిన్నంగా జోర్డాన్ సైన్యం ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ సైన్యం ప్రయోగించిన మూడు బాలిస్టిక్ క్షిపణులను గగనతలంలోనే విజయవంతంగా అడ్డుకుని కూల్చివేసినట్లు జోర్డాన్ రక్షణ శాఖ వెల్లడించింది. దీని వల్ల తమ దేశంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని పేర్కొంది.
ఇతర గల్ఫ్ దేశాలపై కూడా దాడులు
ఇరాన్‌షహర్‌లో ఇరాన్ సైనికుల హత్యకు ప్రతీకారంగా సిరియాలోని అల్-తాన్ఫ్ వద్ద ఉన్న అమెరికా ప్రత్యేక ఆపరేషన్ల కమాండ్ సెంటర్‌పై కూడా దాడులు చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. అయితే దీనిపై సిరియా ప్రభుత్వం కానీ, అమెరికా సైన్యం కానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇదిలా ఉండగా.. గత నెలలో ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఇరు దేశాల దాడులతో కుప్పకూలింది. హోర్మూజ్ జలసంధిపై నియంత్రణ కోసం అమెరికా, ఇరాన్ ఒకదానిపై ఒకటి దాడులు చేసుకోవడంతో ఈ ప్రాంతం కొన్ని రోజులుగా ఉద్రిక్తంగా మారింది.






