నగరంలో యథేచ్ఛగా బెల్టు షాపుల నిర్వహణ

by Kodari Anjali |

నగరంలో యథేచ్ఛగా బెల్టు షాపుల నిర్వహణ
X

దిశ, కరీంనగర్ బ్యూరో : ముందు చూస్తే అదో నిత్యావసర సరకులు అమ్మే కిరాణా కొట్టు ఒక్కడుగు లోపలికి వెళ్తే మత్తులో తూలేందుకు మద్యం పుల్.. ఇదెక్కడా అనే కదా మీ సందేహం.. ఏదో మారుమూలనో లేక మరేదైనా పల్లెటూరో అనుకుంటే పొరపాటు పడ్డట్టే.. ఇది కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ డివిజన్ లో రోడ్డును ఆక్రమించి అనుమతులు లేకుండా అనధికారికంగా బార్ అండ్ రెస్టారెంట్ స్థాయిలో సాగుతున్న అక్రమ దందా. ఇక్కడ మద్యం మత్తులో మద్యం ప్రియులు మునిగి తేలుతుంటే మాముళ్ల మత్తులో అధికారులు మొద్దు నిద్రలో మునుగుతున్నారు. దీంతో స్థానికులు ఎంత వ్యతిరేకించినా అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసిన ఆగకుండా అక్రమ దందా యథేచ్ఛగా సాగుతుంది అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

రోడ్డును ఆక్రమించి అక్రమ దందా

జిల్లా కేంద్రంలోని రేకుర్తి కంటి ఆస్పత్రి సమీపంలో ప్రధాన రోడ్డు ను ఆక్రమించి అక్రమ దందా సాగించడం పై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే మామూలుగా రోడ్లపై కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించే వారిపై ప్రతాపం చూపించే మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుండగా ముందేమో కిరాణ కొట్టు లోపల బార్ ను తలపించే మద్యం వ్యాపారం ఇక్కడి ప్రత్యేకత .అయితే రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేపట్టడం పై స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

అర్ధరాత్రులు ఆగని అక్రమ దందా

నగరంలో రాత్రి 11 దాటింది అంటే బార్ లను మూసివేసే ఆంక్షలు అమలు అవుతున్నప్పటికి ఇక్కడ మాత్రం 24 గంటలు మద్యం సర్వీసులు సాగుతున్నాయి. నగరంలో బార్ లు మూసివేస్తే జనం ఇక్కడికి బారులు తీరుతారు. అయితే పొద్దంతా మద్యం ప్రియులు నామమాత్రంగానే వస్తున్నప్పటికీ చీకటి పడిందంటే అక్కడి క్యూ కడతారు. దీంతో ఆ రోడ్డు అర్థరాత్రి మద్యం మత్తులో తూగే వారితో బిజీగా మారుతుంది. ఇక మద్యం మత్తులో మద్యం ప్రియులు చేసే విన్యాసాలు వికృత చేష్టలతో స్థానిక జనం విసిగివేసారుతున్నారు.

Next Story