ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్

by Taduka Kalyani |   (  Updated:2025-07-23 15:44:59  IST  )

ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్
X

దిశ, తంగళ్లపల్లి : ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. బుధవారం తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిరిసిల్ల రూరల్ సిఐ మొగిలి వివరాలు వెల్లడించారు. గత కొంతకాలంగా తంగళ్ళపల్లి మండలంలో ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులకు చిక్కారని తెలిపారు. తంగళ్ళపల్లి ఎస్ఐ ఉపేంద్ర చారి , సిబ్బంది కేసుల దర్యాప్తు అనంతరం చాకచక్యంగా దొంగలను పట్టుకొన్నారని వివరించారు. సిరిసిల్ల బీవైనగర్ కు చెందిన ఆడెపు రవికుమార్, సిరిసిల్లకు చెందిన మరాఠీ రాకేష్, ఎండి సోహెల్ లు బైకులు దొంగతనం చేయగా, ఇందులో ఇద్దరు వ్యక్తులను పట్టుకోగా, రాకేష్ పరారీలో ఉన్నాడని తెలిపారు. గత ఏడు నెలల నుంచి తంగళ్ళపల్లి మండలంతో పాటు ముస్తాబాద్, మాచారెడ్డి, సిరిసిల్ల, వేములవాడలలో 10 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు వివరించారు.

వీటిలో కొన్ని బైకులను చందుర్తి, కరీంనగర్, సిరిసిల్ల సంబంధించిన వ్యక్తులకు తక్కువ ధరకు విక్రయించారని, దొంగతనం చేసిన బైక్ లను కొన్న వారిపై కూడా కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి బైకులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. దొంగతనం చేసిన మొత్తం 10 బైకులను స్వాధీనం చేసుకొని వారిని అరెస్టు చేశామని సిఐ తెలిపారు. కేసులను దర్యాప్తు చేసి చాకచక్యంగా వివరించి దొంగలను పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, బాల నరసయ్య, కానిస్టేబుల్స్ నరేందర్, రామ్మోహన్, వికాస్ లను సీఐ అభినందించారు. ఎవరైనా డాక్యుమెంట్ లేకుండా బైకులు కొన్నట్లయితే వారిపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే ద్విచక్ర వాహనాలకు కచ్చితంగా నంబర్ ప్లేట్లు ఉండాలని, బైక్ నడుపుతున్న వారి వద్ద బైక్ కు సంబంధించిన డాక్యుమెంట్లు ఉంచుకోవాలని సూచించారు.

Next Story