- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుల భారంతో రెండు కుటుంబాల్లో విషాదం..
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో అప్పుల భారం మరోసారి రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

దిశ, ముస్తాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో అప్పుల భారం మరోసారి రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఆర్థిక ఇబ్బందులు, చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురైన ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ఘటనల్లో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముస్తాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. ఆవునూరు గ్రామానికి చెందిన బండి లావణ్య (38) భర్త రవి మూడేళ్ల క్రితం కుటుంబ పోషణ కోసం దుబాయ్‌కు వెళ్లాడు. అయితే ఆశించిన స్థాయిలో ఉపాధి, ఆదాయం లభించకపోవడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. పిల్లల చదువులు, కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు సుమారు రూ.5 లక్షలకు చేరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన లావణ్య శనివారం రాత్రి తన నివాసంలో ఉరివేసుకొని మృతి చెందినట్లు తెలిపారు.
అప్పులు ఎలా తీర్చాలనే ఆందోళనతో..
మృతురాలి కుమారుడు బండి వికాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అదే రోజు పోతుగల్ గ్రామానికి చెందిన ఈరవేణి పర్షరాములు (42) వ్యవసాయ భూమిలో బోర్లు వేయడం, కుమారుడిని కువైట్‌కు పంపించడం కోసం సుమారు రూ.13 లక్షల వరకు అప్పులు చేసినట్లు తెలిసింది. నాలుగు నెలల క్రితం కుమారుడు స్వదేశానికి తిరిగి వచ్చిన అనంతరం అప్పులు ఎలా తీర్చాలనే ఆందోళనతో మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం రాత్రి ఆయన కూడా తన నివాసంలో ఉరివేసుకొని మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడి కుమారుడు ఈరవేణి తేజ ఫిర్యాదు మేరకు ముస్తాబాద్ ఎస్సై జ్యోతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకే రోజు మండలంలో చోటుచేసుకున్న ఈ రెండు ఘటనలు స్థానికంగా విషాదాన్ని మిగిల్చాయి.






