- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండి సంజయ్ పాదయాత్రతో ట్రాఫిక్ రద్దీ
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్ర సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా ఏర్పడింది.

దిశ, గంగాధర : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్ర సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా ఏర్పడింది. భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనడంతో ప్రధాన రహదారులపై వాహన రాకపోకలకు అంతరాయం కలగడంతో గంటలకు కొద్ది ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి కనిపించింది. కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం నుంచి జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వరకు నిర్వహిస్తున్న ఈ పాదయాత్రలో వేలాది మంది కార్యకర్తలు పాల్గొంటున్నారు. పాదయాత్ర కొత్త పెల్లి, రామడుగు, గంగాధర మండలాల గుండా కొనసాగుతున్న సమయంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డుపై నడుస్తూ ముందుకు సాగారు. దీంతో కరీంనగర్ - జగిత్యాల ప్రధాన రహదారులపై వాహనాలు నెమ్మదిగా కదలడం లేదా కొంతసేపు పూర్తిగా నిలిచిపోవడం జరిగింది.
పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్తలు రోడ్డును పూర్తిగా ఆక్రమించుకుని నడవడంతో రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వెళ్లే వాహనదారులు, ఉద్యోగులు, వ్యాపారులు కొంతసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని చోట్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ రద్దీ స్పష్టంగా కనిపించింది. పాదయాత్ర కారణంగా వాహనాలు నిలిచిపోవడంతో కొందరు వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు. అత్యవసర పనుల నిమిత్తం ప్రయాణిస్తున్న వారు ఆలస్యమవడంతో అసౌకర్యానికి గురయ్యారు. కొందరు వాహనదారులు రహదారి పక్కన వాహనాలను నిలిపి పరిస్థితి సద్దుమణిగే వరకు వేచి ఉండాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తమై ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఈ దారిలో వెళ్లే అంబులెన్స్లకు ఎలాంటి ఆటంకం కలగకుండా వాటిని పంపించారు. రహదారి రెండు వైపులా నిలిచిపోయిన వాహనాలను దశలవారీగా క్లియర్ చేస్తూ ట్రాఫిక్‌ను ముందుకు సాగించేలా చర్యలు తీసుకున్నారు. కొన్ని చోట్ల వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లించారు. పాదయాత్ర ముందుకు కదులుతున్న కొద్దీ పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ వాహన రాకపోకలు సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నించారు. కొంతసేపటి తరువాత పరిస్థితి క్రమంగా సాధారణమైంది. పాదయాత్రలో భారీ జనసందోహం కారణంగానే పలు చోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తినట్లు స్థానికులు తెలిపారు.






