- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KTR: సిరిసిల్ల మున్సిపల్ పీఠంపై మూడుపార్టీల కన్ను

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపాలిటీ పీఠంపై మూడు ప్రధాన పార్టీలు కన్నుపెట్టాయి. పట్టు నిలుపుకోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సర్వశక్తులొడ్డుతుండగా, సిరిసిల్ల బల్దియాపై పాగా వేయడానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోరాడుతున్నాయి. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీల అగ్రనేతల ఎన్నికల ప్రచారం పూర్తయింది. పూర్తి ప్రచారం చేసుకోవడానికి నేటితో ఆఖరి రోజు కాగా, ఇక మిగిలిన రెండు రోజులే కీలకంగా మారనున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి చుక్క, ముక్కలే ప్రధాన ఎరలుగా మారుతున్నాయి. కాగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో సిరిసిల్లలో రాజకీయం మరింత వేడెక్కుతోంది.
సర్వశక్తులొడ్డుతున్న కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల బీఆర్ఎస్ అడ్డా అన్న విషయం రాష్ట్రమంతా తెలిసిందే. అధికారం ఉన్న 10 ఏళ్లు సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ పాలన కొనసాగింది. అయితే రాష్ట్ర అవతరణ తర్వాత రెండవసారి జరిగే ఈ మున్సిపాలిటీ ఎన్నికలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో కేటీఆర్ కు సవాల్‌గా మారాయి. ఎలాగైనా సిరిసిల్ల బల్దియా పీఠాన్ని కైవసం చేసుకోవాలని కేటీఆర్ సర్వశక్తులొడ్డుతున్నారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నుంచి కేటీఆర్ సిరిసిల్లలో మూడు సార్లు పర్యటించి, పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించారు. అభ్యర్థుల ఎంపిక మొదలుకొని అన్ని తానే స్వయంగా పర్యవేక్షించారు. ఇటీవల గతంలో ఎన్నడూ లేనివిధంగా కేటీఆర్ మూడు రోజులు సిరిసిల్లలోనే ఉండి, రెండు రాత్రులు నిద్రించి సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని వార్డులలో రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్ లు నిర్వహించడమే కాకుండా ప్రముఖుల ఇళ్లలోకి వెళ్లి పలకరించడం గమనార్హం.
పాగా వేయడానికి పోరాడుతున్న కాంగ్రెస్, బీజేపీ
ఇదిలా ఉండగా సిరిసిల్ల మున్సిపల్ పై పాగా వేయడానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోరాటం చేస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కోసం ఆరాటపడుతోంది. ఎలాగైనా సిరిసిల్ల మున్సిపల్ పీఠం కైవసం చేసుకుని కేటీఆర్ ను ఎదురుదెబ్బ కొట్టాలని వ్యూహాలు పన్నుతోంది. ఇదే తరహాలో బీజేపీ సైతం సిరిసిల్ల బల్దియా పీఠం కోసం పాకులాడుతోంది. అభ్యర్థుల తుది జాబితా వెలువడిన మరుసటి రోజే పట్టణ నడిబొడ్డున కేంద్ర మంత్రి బండి సంజయ్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. అంతకుముందు సిరిసిల్లలో సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థులతో పాటు నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపారు. ఇక కాంగ్రెస్ నిన్నటి రోజు ఏకంగా ఇద్దరు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ లతో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించింది.
నేటితో ప్రచారానికి ఆఖరి రోజు
ఐదు రోజులుగా మైకులు, డప్పు చప్పులతో మార్మోగిన వీధులన్నీ ఈరోజు సాయంత్రంతో మూగబోనున్నాయి. నేటి వరకు తమ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ జనంతో ముమ్మర ప్రచారం నిర్వహించారు. నేటితో ప్రచారానికి ఆఖరి రోజు కాగా, రేపు మాత్రం రేపు అభ్యర్థి మాత్రమే ప్రచారం నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే అభ్యర్థుల వెంట ప్రచారానికి వచ్చిన వారికి రోజుకు రెండు వందలు ఇచ్చి, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం పెట్టి లక్షల్లో వెచ్చించారు.
మిగిలింది రెండు రోజులే కీలకం
మిగిలిన రెండు రోజులే కీలకం. ఇప్పటికే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు నానా తంటాలు పడుతున్న క్రమంలో ఈ రెండు రోజులు ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో కసరత్తు చేస్తున్నారు. ఈక్రమంలో ఓటర్ల మద్దతుకు చుక్క, ముక్కలే ప్రధాన ఎరగా మారాయి. కాగా ఈ రెండు రోజుల్లో మాంసం, మద్యంతోపాటు ఓటర్లకు డబ్బులు కూడా పంచనున్నట్లు తెలిసింది. ఎంతలేదన్న ఓటుకు అత్యధికంగా రూ. 5 వేలు ఇవ్వనున్నట్లు సమాచారం.






