అధికారులు మారినా పేర్లు మార్చలే

by velandi.Saikiran |

రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారిక వెబ్ సైట్ లో గందరగోళం నెలకొంది. అధికారులు మారి నెలలు గడుస్తున్నా పాత వారి పేర్లే దర్శనం ఇవ్వడం ఓకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

అధికారులు మారినా పేర్లు మార్చలే
X

అధికారులు మారినా పేర్లు మార్చలే

జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో గందరగోళం!

రెండు వెబ్ సైట్లు.. ముగ్గురు కమిషనర్ల పేర్లు

అసలు కమిషనర్ ఎవరు..? తలలు పట్టుకుంటున్న వైనం

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: ​టెక్నాలజీ యుగంలో ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన అధికారిక వెబ్‌సైట్ల పర్యవేక్షణ కరువై పాత జ్ఞాపకాలను తలపిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారిక వెబ్ సైట్ లో గందరగోళం నెలకొంది. అధికారులు మారి నెలలు గడుస్తున్నా పాత వారి పేర్లే దర్శనం ఇవ్వడం ఓకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వెబ్ సైట్ లో మున్సిపల్ కమిషనర్ వివరాల అప్‌డేట్‌లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్‌గా మహమ్మద్ ఖదీర్ పాషా బాధ్యతలు నిర్వహిస్తుండగా, వెబ్‌సైట్‌లో మాత్రం వేర్వేరు పేర్లు దర్శనమిస్తుండటం సామాన్య ప్రజలను అయోమయానికి గురిచేస్తోంది..

​తెలుగులో ఒకరు.. ఇంగ్లిష్‌లో ఇద్దరు..

జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ను గమనిస్తే అధికారుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తెలుగు వెబ్‌సైట్‌లో ఇంకా పాత కమిషనర్ సమ్మయ్య పేరే కొనసాగుతోంది. ఇక ఇంగ్లిష్ వెర్షన్‌లో చూస్తే ఒకచోట మహమ్మద్ ఖదీర్ పాషా పేరు, మరోచోట ఖదీర్ కంటే ముందు కమిషనర్ గా పనిచేసిన లావణ్య పేరు కనిపిస్తుండటం గమనార్హం. ఆన్‌లైన్‌లో సమాచారం కోసం వెతికే సామాన్యులకు ముగ్గురు కమిషనర్ల పేర్లు కనిపిస్తుండటంతో అసలు ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ ఎవరనేది తెలియక తలలు పట్టుకుంటున్నారు. స్మార్ట్ గవర్నెన్స్, డిజిటల్ తెలంగాణ అంటూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా, క్షేత్రస్థాయిలో కనీసం జిల్లా స్థాయి పోర్టల్‌లో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తుల వివరాలను కూడా నవీకరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యవసర సమాచారం లేదా ఫిర్యాదుల కోసం వెబ్‌సైట్‌ను ఆశ్రయించే వారికి ఈ తప్పుడు సమాచారం ఇబ్బందిగా మారుతోంది.

స్పష్టంగా అధికారుల బాధ్యతారాహిత్యం

సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంతో పట్టణవాసులు పరేషాన్ లో పడే పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల బదిలీలు జరిగి నెలలు గడుస్తున్నా, ఐటీ విభాగం ఈ దిశగా దృష్టి సారించకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది. అంతేకాకుండా ఈ జిల్లా అధికార వెబ్​సైట్​లో మున్సిపల్ కిందిస్థాయి అధికారుల వివరాలు కూడా తప్పుడుగా నమోదై ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వెబ్‌సైట్‌ను పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని పట్టణ, జిల్లా ప్రజలు కోరుతున్నారు. తప్పుడు సమాచారాన్ని తొలగించి, ప్రస్తుతం విధుల్లో ఉన్న కమిషనర్ మహమ్మద్ ఖదీర్ పాషా వివరాలను అధికారికంగా అప్‌డేట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ జిల్లా అధికార వెబ్ సైట్ లో ఉన్న అన్ని శాఖల వివరాలను మరొకసారి పునర్ పరిశీలించాల్సిన అవసరం ఉంది. పాలనలో పారదర్శకత ఉండాలంటే ఇలాంటి చిన్నపాటి నిర్లక్ష్యాలను కూడా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Next Story