కొండగట్టు క్షేత్రంలో ఒక్క‌సారిగా భ‌క్తుల ర‌ద్దీ..కార‌ణం ఇదే

by velandi.Saikiran |   (  Updated:2026-05-11 22:00:41  IST  )

కొండగట్టులో నిర్వహిస్తున్న పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు సోమవారం రెండో రోజు భక్తి పారవశ్యంతో కొనసాగాయి.

కొండగట్టు క్షేత్రంలో ఒక్క‌సారిగా భ‌క్తుల ర‌ద్దీ..కార‌ణం ఇదే
X

కొండగట్టు క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ

కాషాయమయమైన ఆలయ ప్రాంగణం

రెండో రోజు ఘనంగా కొనసాగిన

పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు

దిశ, కొండగట్టు: కోరిన కోర్కెలు తీర్చే భక్తుల పాలిట కొంగు బంగారం పవిత్ర పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో నిర్వహిస్తున్న పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు సోమవారం రెండో రోజు భక్తి పారవశ్యంతో కొనసాగాయి. ‘జై అంజన్న’నామస్మరణలతో కొండగట్టు క్షేత్రం మార్మోగిపోయింది. మండుటెండలను సైతం లెక్కచేయకుండా కాలి నడక నా, వాహనాల పై రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని దీక్ష స్వాములు మాలా విరమణ చేసి, స్వామి వారికి తలనీలాలు అర్పించి తరిస్తున్నారు. ఉదయం వేద మంత్రోచ్ఛరణల మధ్య స్థాపిత దేవతారాధన, హోమం, సుందరకాండ పారాయణం, పంచామృత అభిషేకం, సహస్రనామార్చనలు ఘనంగా నిర్వహించారు.

అనంతరం మహానివేదన, మంత్రపుష్పం కార్యక్రమాల తర్వాత భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, అమ్మవారి కుంకుమార్చన, పుష్పాలతో సహస్రనామార్చన, హోమం, బలిహరణం కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తి గీతాలు, హరికథలు, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ఆలయ ఈఓ ఎస్. అంజనారెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, క్యూలైన్లు, ప్రసాద పంపిణీ, భద్రతా ఏర్పాట్లు ఆలయ అధికారులు చేపట్టారు.

Next Story