- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేములవాడ మున్సిపల్ చైర్మన్ పీఠం పై తీవ్ర ఉత్కంఠ
వేములవాడ పురపాలక సంఘం చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందోననే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

దిశ, వేములవాడ : వేములవాడ పురపాలక సంఘం చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందోననే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 13న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో మొత్తం 28స్థానాలకు కాంగ్రెస్ పార్టీ 13, బీజేపీ 8, బీఆర్ఎస్ 5స్థానాలు దక్కించుకోగా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందిన సంగతి తెలిసిందే. చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి కావాల్సిన మెజారిటీ సీట్లు ఏ పార్టీకి దక్కకపోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను ఎవరు దక్కించుకుంటారనే విషయంలో సస్పెన్స్ నెలకొంది. ఈ క్రమంలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులతో పాటు బి.ఆర్.ఎస్ పార్టీకి చెందిన ఒక కౌన్సిలర్ కాంగ్రెస్ గూటిలో చేరారు. ఈ పరిమాణంతో అధికార కాంగ్రెస్ పార్టీ బలం 16కు పెరిగి చైర్మన్ పీఠం అందుకోవడం లాంఛనమే అయింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార పార్టీకి చెందిన 13మంది కౌన్సిలర్లతో పాటు నూతనంగా పార్టీలో చేరిన ముగ్గురు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధీనంలో హైద్రాబాద్ శివారులో ఓ రిసార్ట్ లో తలదాచుకున్నట్లు, అక్కడి నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో పాల్గొననున్నట్లు తెలుస్తుంది.
రేసులో ముగ్గురు
మరోవైపు చైర్మన్ పీఠం కొరకు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు గట్టిగా పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పుల్కం రాజు, ఇప్పపూల మమత, తుమ్ మధులతో పాటు తాజాగా కొక్కుల బాలకృష్ణయ్య పేరు చైర్మన్ అభ్యర్థులుగా తెరమీదకి వచ్చాయి. మొదటి నుంచి పట్టణంలో వినిపిస్తున్న పేరు పుల్కం రాజు కనక సీనియారిటీ ప్రకారం.. అతనికే చైర్మన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అతనికి ఇవ్వని పక్షంలో మమతకి ఇస్తారని, అది కుదరని పక్షంలో తుమ్ మధుకు ఇచ్చే అవకాశం ఉందని చివరికి అది సాధ్యం కాకపోతే కొక్కుల బాలకృష్ణ పేరు చైర్మన్ గా ప్రతిపాదించే అవకాశం మెండుగా ఉన్నట్టు తెలుస్తుంది.
వైస్ చైర్మన్ కు సైతం పోటాపోటీ
చైర్మన్ పరిస్థితి ఇలా ఉంటే వైస్ చైర్మన్ పీఠానికి సైతం తీవ్ర పోటీ ఉన్నట్టు తెలుస్తుంది. వైస్ చైర్మన్ పీఠానికి మొదటి నుండి పోటీ లేకపోయినా ఎన్నికల ఫలితాలు విడుదలై ముగ్గురు అభ్యర్థులు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వైస్ చైర్మన్ సీట్ సైతం హాట్ సీటుగా మారింది. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి వైస్ చైర్మన్ పదవికి మొదటి నుండి ఎవరి పేర్లు ప్రముఖంగా వినిపించకపోయినా కొత్తగా పార్టీలో చేరిన నరాల శేఖర్, కుమ్మరి శిరీష, ఎల శ్రీనివాస్ లు వైస్ చైర్మన్ పదవి డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. తాము రాకుంటే మీకు మెజార్టీ వచ్చే అవకాశం లేనందున తమకు కచ్చితంగా వైస్ చైర్మన్ పీఠం ఇవ్వాల్సిందేనని క్యాంప్ లో ఎవరికి వారే ఆది శ్రీనివాస్ వద్ద కూర్చుని పట్టుపడుతున్నట్లు సమాచారం.
"ఆది"కి తలనొప్పిగా మారిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక
అభివృద్దినే అస్త్రంగా మార్చుకొని మెజారిటీ స్థానాలకు అడుగు దూరంలో నిలిచి, వేములవాడ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లక్ష్యం మరికొద్దిగంటల్లో నెరవేరనున్న తరుణంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రూపంలో ఆయనకు పెద్ద సవాలు ఎదురైంది. ఓ వైపు పార్టీలో మొదటి నుండి పని చేస్తున్న వారు, మరోవైపు కష్టకాలంలో పార్టీలో చేరి ఆదుకున్నవారు ఇలా రెండు వర్గాల మధ్య పోటీ నెలకొన్న తరుణంలో ఎవరికి ఏ పదవి ఇవ్వాలి...?ఎవరికి ఇస్తే ఏమి జరుగుతుంది...?అడిగిన వారికి ఇవ్వకపోతే ఏమి జరుగుతుంది..? ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్లాలి...? ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి...? సమ్మతి, అసమ్మతి వర్గాలను ఎలా బుజ్జగించాలి వంటి ఆయా అంశాలతో "ఆది" సతమవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏమి చేయాలో "ఆది"కి బాగా తెలుసు అని, అంతా ఆయనే సెట్ చేస్తాడనీ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి కొన్ని గంటల్లో అసలు ఏమి జరుగుతుంది...? చైర్మన్, వైస్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుంది..? ఈ ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది.






